9/11 ఘటనకు 25 ఏళ్లు..ఒక వైపు క్రూరత్వం…మరోవైపు మానవత్వం 

Spread the love

ప్రపంచ చరిత్రలో కొన్ని భయానక సంఘటనలు ఎప్పుడు తలచుకున్నా చేదు జ్ఞాపకాలుగా భయాన్ని గొలుపుతాయి. అటువంటి ఘటన 2001, సెప్టెంబరు 11న జరిగిన ట్విన్ టవర్స్ పై అటాక్.  అగ్రరాజ్యంగా ఉన్న  అమెరికాకు గడగడలాడించిన ఘటన. న్యూయార్క్ నగరంలోని ప్రపంచ ప్రఖ్యాత వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్స్‌ను అల్-ఖైదా ఉగ్రవాదులు విమానాలతో ఢీకొట్టి కూల్చేసిన ఆ భయానక దృశ్యాలు ఈనాటికీ ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉన్నాయి. ఈ ఏడాదితో ఆ పెను విషాదానికి సరిగ్గా 25 ఏళ్లు. అయితే, 9/11 అనగానే మనకు కూలిపోయిన టవర్లు, వేలాది మంది అమాయకుల మరణాలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ, సరిగ్గా అదే సమయంలో ఆకాశంలో ఒక అతిపెద్ద సంక్షోభం కూడా ప్రపంచాన్ని కలవరపెట్టింది. సెప్టెంబరు 11వ తేదీ ఉదయం. రోజూలాగే అమెరికాలోని విమానాశ్రయాలు రద్దీగా ఉన్నాయి. ఉదయం 8 గంటల 46 నిమిషాలకు మొదటి విమానం నార్త్ టవర్‌ను ఢీకొట్టింది. మొదట అదొక ప్రమాదం అనుకున్నారు. కానీ 9 గంటల 3 నిమిషాలకు రెండో విమానం సౌత్ టవర్‌ను ఢీకొట్టడంతో అదొక పక్కా ఉగ్రదాడి అని అమెరికాకు అర్థమైపోయింది. ఆ వెంటనే వాషింగ్టన్‌లోని పెంటగన్‌పై మూడో విమానం కుప్పకూలింది.  పరిస్థితి చేయి దాటిపోతోందని గ్రహించిన ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్  నేషనల్ ఆపరేషన్స్ మేనేజర్ బెన్ స్లినీ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌కు అత్యవసర ఆదేశాలిచ్చారు. క్షణాల వ్యవధిలో అమెరికా గగనతలం మొత్తాన్ని మూసివేశారు. 

అప్పటికే అమెరికా గగనతలంలో ఉన్న విమానాలను వెంటనే సమీపంలోని ఎయిర్‌పోర్టుల్లో దించేశారు. కానీ, ఆ సమయానికి ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి అమెరికాకు బయలుదేరి, అట్లాంటిక్ ,  పసిఫిక్ మహాసముద్రాల మీద ఎగురుతున్న వందలాది విమానాల పరిస్థితి గందరగోళంగా మారింది. వాటిలో సరిపడా ఇంధనం ఉన్న కొన్ని విమానాలు వెనక్కి యూరప్, ఆసియాలకు మళ్లిపోయాయి. కానీ, 240 విమానాలకు మాత్రం వెనక్కి వెళ్లేంత ఇంధనం లేదు, ముందుకెళ్లి అమెరికాలో దిగే పరిస్థితి లేదు. ఆ విమానాల్లో ఏకంగా 30 వేల నుంచి 40 వేల మంది ప్రయాణికులు ప్రాణభయంతో గాల్లో ప్రయాణిస్తున్నారు.ఆ సమయంలో అమెరికా దాడుల గురించి తెలుసుకున్న కెనడా  కూడా భద్రతా కారణాల దృష్ట్యా అప్పటికే తమ ఎయిర్ స్పేస్  మూసివేసింది. కానీ, అమెరికా వెళ్లలేక గాల్లో చిక్కుకుపోయిన ఆ 240 విమానాల పరిస్థితి చూసి కెనడా ప్రభుత్వం స్పందించింది. ఏ క్షణంలో ఇంధనం అయిపోయి సముద్రంలో కూలిపోతాయో తెలియని ఆ విమానాలకు ఆశ్రయం కల్పించాలని నిర్ణయించుకుంది. వెంటనే  ఆపరేషన్ ఎల్లో రిబ్బన్  కు శ్రీకారం చుట్టింది.  వెనక్కి వెళ్లలేని ఆ విమానాలను తమ దేశంలో ల్యాండ్ చేసేందుకు కెనడా అనుమతించింది. అయితే ముందు జాగ్రత్తగా టొరంటో, మాంట్రియల్, ఒట్టావా లాంటి భారీ జనాభా ఉన్న నగరాల్లో కాకుండా.. సరిహద్దుల్లో, మారుమూల ఉన్న విమానాశ్రయాలకు వాటిని దారి మళ్లించారు. అలా హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టులో 47, వాంకోవర్ విమానాశ్రయంలో 34, గాండాలో 38 విమానాలు ల్యాండ్ అయ్యాయి. ఎటు చూసినా విమానాలే.. ఎయిర్‌పోర్టు రన్‌వేలు, టాక్సీవేలు పూర్తిగా విమానాలతో నిండిపోయాయి. 

కెనడా గగనతలంలోకి వచ్చిన విమానాలకు అమెరికా, కెనడా వైమానిక దళాలకు చెందిన ఫైటర్ జెట్స్  ఎస్కార్ట్‌గా వెళ్లాయి. ఆ సమయంలో సౌత్ కొరియాకు చెందిన ఒక ప్యాసింజర్ విమానం పైలట్ల నుంచి కమ్యూనికేషన్ సరిగ్గా అందలేదు. ఆ విమానం కూడా హైజాక్ అయ్యిందేమోనని భద్రతా బలగాలు అనుమానించాయి. ఆ విమానం ల్యాండ్ అయిన వెంటనే భద్రతా సిబ్బంది తుపాకులు గురిపెట్టి పైలట్లను కిందకు దించి చెక్ చేశారు. ప్రతి విమానాన్ని భద్రతా దళాలు అణువణువూ ముమ్మరంగా తనిఖీ చేశాయి. అంతవరకు ఆ ప్రయాణికులను విమానాల నుంచి కిందకు దించలేదు. అలా భయం భయంగా, ఆహారం, కనీస సౌకర్యాలు లేకుండా కొన్ని విమానాల్లోని ప్రయాణికులు ఏకంగా 24 గంటల పాటు ఆ సీట్లలోనే ఉండిపోవాల్సి  వచ్చింది.నాటి దాడుల వేళ కెనడాలోని దాదాపు 17 విమానాశ్రయాల్లో విమానాలు దిగాయి. కానీ, ఉత్తర అమెరికాకు తూర్పున న్యూఫౌండ్‌లాండ్ దీవుల్లో ఉన్న గాండా అనే ఒక చిన్న పట్టణం మాత్రం ఈ ఆపరేషన్‌లో చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయింది.  భౌగోళికంగా గాండా చాలా చిన్న ఊరు. అక్కడ ఉండే మొత్తం జనాభా 10 వేల కంటే తక్కువే.  ఆ విమానాశ్రయంలో సాధారణంగా రోజుకు కేవలం ఏడెనిమిది విమానాల రాకపోకలు మాత్రమే సాగేవి. కానీ 9/11 వేళ ఏకంగా 38 భారీ ప్యాసింజర్ విమానాలు అక్కడ ల్యాండ్ అయ్యాయి. అందులో 6 వేలకు పైగా ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. ఊరి జనాభా 10 వేలు ఉంటే, కొత్తగా వచ్చిన వారు 6 వేల మంది. ఆ పట్టణంలోని అన్ని హోటళ్ల గదులు కలిపినా 500కు మించి ఉండవు. మరి ఈ ఆరు వేల మందికి వసతి, భోజనం కల్పించేందుకు అక్కడి ప్రజలు ముందుకు వచ్చి వారిని ఆదుకున్నారు. కమ్యూనిటీ సెంటర్లు, స్కూళ్లను అధికారులు షెల్టర్లుగా మార్చితే.. స్థానికులు మాత్రం ఏకంగా తమ ఇళ్ల తలుపులు తెరిచారు. పరిచయం లేని విదేశీయులకు తమ ఇళ్లల్లో ఆశ్రయం కల్పించారు. అమెరికా గగనతలం తెరుచుకునే వరకు దాదాపు ఐదు రోజుల పాటు ఆ 6 వేల మంది ప్రయాణికులు ఆ చిన్న పట్టణంలోనే ఆశ్రయం పొందారు.

ఐదు రోజుల తర్వాత పరిస్థితి చక్కబడిన తరువాత  ఆ ప్రయాణికులంతా గాండా పట్టణాన్ని వీడి తమ గమ్యస్థానాలకు బయలుదేరారు. కానీ అక్కడి ప్రజలు అందించిన సాయం వారి మనస్సులో ఎప్పటికీ మర్చిపోలేని ముద్ర వేసింది. స్థానికుల మానవత్వానికి కదిలిపోయిన ఒక విమానంలోని ప్రయాణికులంతా కలిసి, వెళ్తూ వెళ్తూ గాండా  విద్యార్థుల కోసం ఒక స్కాలర్‌షిప్  కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలా ఆనాటి ప్రయాణికులు ఆ చిన్న ఊరి పిల్లల చదువుల కోసం ఇప్పటివరకు మిలియన్ డాలర్లకు పైగా ఫండ్ అందించడం కృతజ్ఞతకు నిదర్శనం.  నాడు గాండర్ లో జరిగిన ఆ అప్పటి  పరిణామాలు, అక్కడి ప్రజలు చూపించిన సహకారం ఆ తర్వాత కాలంలో ఎన్నో విధాలుగా  ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయి.  మానవుడిలోని క్రూరత్వానికి నిదర్శనంగా  9/11 ఉగ్రవాద  దాడులు నిలిస్తే మరోవైపు కెనడా ప్రజల మానవత్వం దానికి ప్రతిగా ఆశ్రయం పొందిన ప్రయాణికులు చూపిన కృతజ్ఞత మానవత్వాన్ని కళ్లకు కట్టినట్లు చూపింది. 25 ఏళ్లు గడిచినా నాటి చేదు జ్ఞాపకాలతో పాటు  ఈ తీపి గుర్తులు మానవాళిలో ఉన్న భిన్న పార్శాలను చూపుతోంది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *