కేసీఆర్‌ నా జూనియర్… జగన్ ఓ డిక్టేటర్ అంటూ టీడీపీ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఫైర్..!

Spread the love

టీడీపీ సీనియర్ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి రెండు తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్, కేసీఆర్‌లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…రాజమహేంద్రవరంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ఏపీ – తెలంగాణ మధ్య నెలకొన్న విభజన సమస్యల పరిష్కారానికి వీరిద్దరి వైఖరే ప్రధాన అడ్డంకిగా మారిందని విమర్శించారు. కేసీఆర్ తనకంటే రాజకీయాల్లో జూనియర్ అని, జగన్ ఒక ‘డిక్టేటర్’ (నియంత) లా వ్యవహరిస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని, సాగునీటి ప్రాజెక్టులు మరియు నిరుద్యోగ సమస్యలపై జగన్ సర్కార్ విఫలమైందని మండిపడ్డారు. 

అయితే గోదావరి జలాలపై ఏపీ హక్కులను కాపాడటంలో తాము వెనక్కి తగ్గబోమని, కేసీఆర్ అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో తన సూచనలు వినని వల్లభనేని వంశీ, కొడాలి నాని వంటి నేతలు ఇప్పుడు తమ తప్పులకు రాజకీయ, చట్టపరమైన ఫలితాలను అనుభవిస్తున్నారని వ్యాఖ్యానించారు.కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు విజనరీ నాయకత్వాన్ని పవన్ కళ్యాణ్ అర్థం చేసుకున్నారని, రాష్ట్ర ప్రయోజనాల కోసం తామంతా ఐక్యంగా పని చేస్తామని బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.నాయకత్వంలో చిత్తశుద్ధి ఉంటేనే విభజన సమస్యలు పరిష్కారమవుతాయని, అది కేవలం టీడీపీకే సాధ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.