కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో బాగా మందు తాగి వాహనాలు నడిపే వారి కారణంగా జరిగే ప్రమాదాలను నివారించేందుకు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ (టీజీపీడబ్ల్యూయూ) ఒక మంచి జనహితార్థ నిర్ణయాన్ని తీసుకుంది. నగర పౌరులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా నూతన సంవత్సర వేడుకలను ఆనందంగా జరుపుకోవాలని యూనియన్ ఆకాంక్షించింది. తాగిన మైకంలో డ్రైవింగ్ చేసే బదులు, తమ ఉచిత సేవలను వినియోగించుకోవాలని కోరింది. న్యూఇయర్ పార్టీల్లో ఆల్కహాల్ తాగిన వారు సురక్షితంగా ఇళ్లకు చేరుకునేందుకు వారి కోసం ఫ్రీగా రవాణా సేవలను అందిస్తున్నట్లు తెలిపింది. ఈ సేవలు ఈరోజు రాత్రి 11 గంటల నుంచి అర్ధరాత్రి 1 గంట వరకు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎక్కడైనా ఈ సేవలను ఉపయోగించుకోవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా క్యాబ్‌లు, ఆటోలు, ఎలక్ట్రిక్ బైక్‌లతో కలిపి మొత్తం 500 వాహనాలను సిద్ధం చేసినట్లు యూనియన్ ప్రతినిధులు తెలిపారు. పార్టీల తరువాత సేఫ్ గా ఇంటికి వెళ్లాలనుకునే వారు, తమకు ఫ్రీ రైడ్ కావాలని కోరుతూ 8977009804 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వల్ల కలిగే అనర్ధాలను నివారించి, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడమే తమ ప్రధాన ఉద్దేశమని టీజీపీడబ్ల్యూయూ పేర్కొంది.