రాజస్థాన్‌లోని టోంక్ జిల్లాలో నూతన సంవత్సర వేళ భారీ ఎత్తున పేలుడు పదార్థాలు లభ్యం కావడం తీవ్ర కలకలం రేపింది.ఒక కారులో 150 కిలోల అమ్మోనియం నైట్రేట్‌తో పాటు 200 కాట్రిడ్జ్‌లు, సుమారు 1,100 మీటర్ల పొడవైన సేఫ్టీ ఫ్యూజ్ వైర్లను తరలిస్తుండగా పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిఘా వర్గాల సమాచారంతో బరోని పోలీస్ స్టేషన్ పరిధిలో తనిఖీలు చేపట్టిన అధికారులు, యూరియా సంచుల్లో దాచి ఉంచిన ఈ మందుపాతర సామాగ్రిని గుర్తించి సీజ్ చేశారు. ఈ కేసులో బూందీ జిల్లాకు చెందిన సురేంద్ర పట్వా, సురేంద్ర మోచీ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. బూందీ నుండి టోంక్ జిల్లాకు తరలిస్తున్న ఈ పేలుడు పదార్థాలను ఏదైనా విధ్వంసకర చర్యల కోసం ఉపయోగిస్తున్నారా లేక అక్రమ మైనింగ్ కోసమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.న్యూ ఇయర్ వేడుకల సమయంలో ఇంత భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు పట్టుబడటంతో పోలీసులు హై అలర్ట్ ప్రకటించి, నిందితులను కఠినంగా విచారిస్తున్నారు.