చైనా ఒకప్పుడు అత్యధిక జనాభా కలిగిన దేశం. దశాబ్దాల పాటు కొనసాగించిన “ఒక్కరే బిడ్డ” (One-Child Policy) విధానం వల్ల చైనాలో యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగిపోయింది. ఇది దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతుండటంతో, చైనా ప్రభుత్వం తన ధోరణిని పూర్తిగా మార్చుకుంది. ప్రస్తుతం జనాభా సంక్షోభాన్ని ఎదుర్కొంటూ జననాల రేటును పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కండోమ్ మరియు గర్భ నిరోధక సాధనాలు, మెడిసిన్స్ పై 13 శాతం పన్ను విధించింది. ఈ కొత్త సంవత్సరం వేళ ఈ నిర్ణయం అమల్లోకి వచ్చింది. వయసు పైబడిన జనాభా పెరుగుతుండడం, ఆర్థిక వ్యవస్థ మందకొడిగా కొనసాగుతుండటం వంటి పరిస్థితుల్లో యువత పెళ్లి చేసుకొని, పిల్లల్ని కనేలా చైనా ప్రభుత్వం ప్రోత్సాహకాలను ప్రకటిస్తోంది. ఈ క్రమంలోనే ఇటువంటి చర్యలు తీసుకుంటోంది. గర్భనిరోధక సాధనాలు సహా పలు వస్తువులపై 13 శాతం పన్ను విధిస్తూవేల్యూ యాడెడ్ ట్యాక్స్ చట్టాన్ని ఇప్పటికే సవరించింది. కొన్ని దశాబ్దాల పాటు కుటుంబ నియంత్రణను కఠినంగా అమలుచేసిన సంగతి తెలిసిందే. దాంతో ఈ ఉత్పత్తులపై 1993 నుంచి పన్ను మినహాయింపు కొనసాగింది. ఇటీవల ప్రభుత్వం దానిని ఎత్తివేసి కొత్త పన్నును అమల్లోకి తీసుకువచ్చింది. ఇప్పటికే పిల్లల సంరక్షణ సేవలు (నర్సరీ నుంచి కిండర్గార్టెన్స్ వరకు), వృద్ధుల సంరక్షణ, వికలాంగుల సేవలు, వివాహ సంబంధిత సేవలపై పన్ను మినహాయింపును ప్రకటించింది.