వైఎస్ వివేకా హత్య కేసు: ఏ2 సునీల్ యాదవ్ భార్యకు ప్రాణాపాయ బెదిరింపులు!

Spread the love

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో నిందితులకు బెదిరింపులు రావడం పులివెందులలో కలకలం రేపింది.ఈ కేసులో రెండో నిందితుడు (A2)గా ఉన్న సునీల్ యాదవ్ భార్యను గుర్తుతెలియని దుండగులు అడ్డగించి తీవ్రంగా బెదిరించినట్లు సమాచారం.ఆమె ఆసుపత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఆపిన వ్యక్తులు…మాజీ సీఎం జగన్, ఎంపీ అవినాష్ రెడ్డిలను ఎదిరించే ధైర్యం నీ భర్తకు ఉందా? అని ప్రశ్నిస్తూ భయాందోళనకు గురిచేశారు.అంతటితో ఆగకుండా, “నీ బిడ్డను చంపితే ఏం చేస్తారు?” అంటూ ప్రాణాపాయ హెచ్చరికలు చేయడంతో ఆమె తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.

ఈ ఘటనపై సునీల్ యాదవ్ దంపతులు వెంటనే స్పందించి పులివెందుల పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నిందితుల నుంచి తమ కుటుంబానికి రక్షణ కల్పించాలని వారు కోరారు.అత్యంత సున్నితమైన ఈ హత్య కేసులో సాక్షులను లేదా నిందితుల కుటుంబ సభ్యులను ఇలా బహిరంగంగా బెదిరించడం స్థానికంగా చర్చనీయాంశమైంది.పోలీసులు ఈ ఫిర్యాదును స్వీకరించి, ఆ ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజీని విశ్లేషిస్తూ నిందితుల కోసం గాలింపు చేపట్టారు. ఈ పరిణామం వివేకా హత్య కేసు విచారణలో ఎలాంటి మలుపులు తిరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.