కొత్త సంవత్సరం వస్తుందంటే చాలు ఆల్కహాల్ సేవించి స్వాగతిస్తుంటారు కొందరు. అయితే మరికొందరు మాత్రం సరికొత్త మంచి అలవాట్లతో కొత్త కొత్త రిజల్యూషన్స్ తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. కాగా, ఆల్కహాల్ కు దూరంగా ఉండి, మంచి అలవాట్లతో కొత్త ఏడాదిని ప్రారంభించాలనే సందేశాన్ని ఇచ్చేందుకు రాజస్థాన్ రాజధాని నగరం జైపూర్ లో 200కు పైగా కేంద్రాల్లో దాదాపు లక్ష లీటర్ల పాలను పంపిణీ చేశారు. రాజస్థాన్ యూనివర్సిటీ గేటు వద్ద రాష్ట్ర యూత్ స్టూడెంట్స్ అసోసియేషన్, ఇండియన్ ఆస్తమా కేర్ సొసైటీ సంయుక్తంగా పాలను పంపిణీ చేశాయి. కార్యక్రమంలో జైపుర్ పోలీసులు కూడా భాగస్వాములయ్యారు. ఈ ప్రయత్నాన్ని నగర అదనపు పోలీసు కమిషనర్ రాజీవ్ పచార్ అభినందించారు. గత 21 ఏళ్లుగా కొత్త సంవత్సరాది సందర్భంగా పాలను పంపిణీ చేస్తున్నట్లు తెలుస్తోంది.