అదొక చెడు పొరుగుదేశం.. పాక్ పై మండిపడ్డ విదేశాంగ మంత్రి జై శంకర్

Spread the love

విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పొరుగు దేశం పాకిస్థాన్‌ పై మండిపడ్డారు. ఈరోజు ఐఐటీ మద్రాస్ విద్యార్థులతో మాట్లాడుతూ ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ను ఆయన ఒక “చెడు  పొరుగు దేశం” గా అభివర్ణించారు. ఉగ్రవాదం నుంచి తమ ప్రజలను కాపాడుకునే హక్కు భారత్‌కు ఉందని స్పష్టం చేశారు.  గతేడాది పహల్గామ్‌లో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ జరిపిన దాడి తర్వాత, భారత్ “ఆపరేషన్ సిందూర్” తో పాక్ పై విరుచుకుపడిన సందర్భాన్ని ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. మేము మా హక్కును ఎలా వినియోగించుకుంటామనేది మా ఇష్టం. ఏం చేయాలో, ఏం చేయకూడదో మాకు ఎవరూ చెప్పలేరు. మమ్మల్ని మేము రక్షించుకోవడానికి ఏం చేయాలో అది చేస్తామని పేర్కొన్నారు. పాకిస్థాన్  ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని  మండిపడ్డారు.

సింధు జలాల ఒప్పందం గురించి కూడా జైశంకర్ మాట్లాడారు. పహల్గామ్ దాడి తర్వాత ఈ ఒప్పందాన్ని నిలిపివేసిన సంగతి తెలిసిందే. చాలా ఏళ్ల క్రితం మనం నీటి పంపకాల ఒప్పందానికి అంగీకరించాం. కానీ, దశాబ్దాలుగా ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నప్పుడు, అక్కడ మంచి పొరుగు సంబంధాలు లేనట్టేనని  మంచి సంబంధాలు లేనప్పుడు, దాని ప్రయోజనాలు కూడా ఉండవని పేర్కొన్నారు. మాతో నీళ్లు పంచుకో, కానీ నేను నీపై ఉగ్రవాదాన్ని కొనసాగిస్తాను అంటే కుదరదని ఆయన స్పష్టం చేశారు.