తెలంగాణ అసెంబ్లీలో మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టుపై జరిగిన చర్చ శుక్రవారం (జనవరి 2, 2026) అత్యంత వాడివేడిగా సాగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలను ఉద్దేశించి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మూసీ నదిలో ఉన్న కాలుష్యం కంటే ప్రతిపక్ష నేతల కడుపుల్లోనే ఎక్కువ విషం నిండి ఉందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. “మూసీపై మేం నిజాలు చెబుతుంటే తట్టుకోలేక విషం కక్కుతున్నారు.. వారి విషపు చూపులు ప్రజలందరూ చూస్తున్నారు” అంటూ మండిపడ్డారు. అధికారం కోల్పోయినా బీఆర్ఎస్ నేతలకు ఇంకా అహంకారం, అసూయ తగ్గలేదని ఎద్దేవా చేశారు.
మూసీ ప్రక్షాళన వల్ల నల్గొండ ప్రజల కష్టాలు తీరుతాయని, మురికి కూపంలో మగ్గుతున్న పేదలకు అండగా ఉంటామని సీఎం స్పష్టం చేశారు. “ఫామ్‌హౌస్‌లు కట్టుకుని మూసీని కలుషితం చేసిన వాళ్లే ఇప్పుడు సుద్దులు చెబుతున్నారు.. మీరు మీ కడుపు మంటను చూపకుండా, ప్రాజెక్టుకు ఏమైనా మంచి సలహాలుంటే ఇవ్వండి” అని హితవు పలికారు. రేవంత్ రెడ్డి చేసిన ఈ ‘విషం’ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ముఖ్యమంత్రి తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని, అసెంబ్లీని బూతుల మయం చేస్తున్నారని హరీష్ రావు ధ్వజమెత్తారు