ముస్తాఫిజుర్‌పై బీసీసీఐ వేటు..కేకేఆర్‌కు షాకిచ్చిన బోర్డు..!

Spread the love

బంగ్లాదేశ్‌లో హిందూ మైనారిటీలపై జరుగుతున్న వరుస దాడులు, అక్కడ నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ఐపీఎల్‌పై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి.ఇటీవల జరిగిన ఐపీఎల్ మినీ వేలంలో బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.2 కోట్ల రికార్డు ధరకు దక్కించుకున్న విషయం తెలిసిందే.అయితే, సోషల్ మీడియాలో వ్యక్తమవుతున్న తీవ్ర వ్యతిరేకత , ప్రస్తుత దౌత్య పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ (BCCI), ముస్తాఫిజుర్‌ను జట్టు నుంచి విడుదల చేయాలని కేకేఆర్ యాజమాన్యాన్ని ఆదేశించింది.ఈ సంచలన నిర్ణయాన్ని బీసీసీఐ సెక్రటరీ దేవజిత్ సైకియా స్వయంగా ధ్రువీకరించారు.తొలుత ప్రభుత్వం నుండి ఎలాంటి మార్గదర్శకాలు రాలేదని బోర్డు వర్గాలు పేర్కొన్నప్పటికీ, పరిస్థితులు విషమిస్తుండటంతో కఠిన నిర్ణయం తీసుకోక తప్పలేదు. 2016 నుండి ఐపీఎల్‌లో కొనసాగుతున్న ముస్తాఫిజుర్, ఇప్పటివరకు 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు తీసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు.

భారత్-బంగ్లా సిరీస్ డైలమాలో!

మరోవైపు, ఈ పరిణామం భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్‌లపై నీలి నీడలు కమ్ముకునేలా చేసింది.ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబరు మధ్య మూడు వన్డేలు, మూడు టీ20ల సిరీస్ కోసం టీమ్ ఇండియా బంగ్లా పర్యటనకు వెళ్లాల్సి ఉందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) ఇటీవలే ప్రకటించింది. గత ఏడాది రాజకీయ కారణాల వల్ల వాయిదా పడిన సిరీస్‌లను ఈ పర్యటనతో భర్తీ చేయాలని బీసీబీ భావించింది. అయితే, ముస్తాఫిజుర్ విషయంలో బీసీసీఐ తీసుకున్న తాజా నిర్ణయం ఇరు దేశాల మధ్య క్రీడా సంబంధాల బీటలను స్పష్టం చేస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారత జట్టు బంగ్లాదేశ్‌లో పర్యటించడం దాదాపు అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.