ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తెలంగాణ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు చేసిన వ్యాఖ్యల పట్ల కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.అసెంబ్లీ వేదికగా దేశ ప్రధానిపై అభ్యంతరకర రీతిలో మాట్లాడటం ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అని ఆయన మండిపడ్డారు.దేశవ్యాప్తంగా కమ్యూనిస్టు పార్టీలు తమ ఉనికిని కోల్పోవడానికి ఇటువంటి బాధ్యతారహితమైన, అసభ్యకరమైన భాషే ప్రధాన కారణమని బండి సంజయ్ విమర్శించారు.కూనంనేని తన వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, ప్రధాని మోదీకి & దేశ ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన స్పష్టం చేశారు.
అసెంబ్లీలో ఇటువంటి అనుచిత వ్యాఖ్యలను స్పీకర్ అనుమతించడం బాధాకరమని,ఇది కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని బండి సంజయ్ ఆరోపించారు.మిత్రపక్షమైన సీపీఐని కాపాడుకోవడానికే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాస్వామ్య విలువలను గాలికొదిలేసిందని ఆయన విమర్శించారు.ప్రపంచ దేశాల ముందు భారత్ కీర్తిని పెంపొందించిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్, కమ్యూనిస్టులకు లేదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ దూషణలకే పరిమితమైన వీరికి ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారని, తమ తప్పును సరిదిద్దుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని బండి సంజయ్ హెచ్చరించారు.