మహారాష్ట్రలో పురపాలక ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి ఎన్నికలకు ముందే 68 స్థానాలను కైవసం చేసుకుంది. ఎలక్షన్ లేకుండానే 68 స్థానాల్లో ఈ కూటమి అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ జనవరి 2తో ముగిసింది. ఈ క్రమంలో ప్రత్యర్థి పార్టీలకు చెందిన పలువురు అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకున్నారు. దీంతో పలు స్థానాల్లో పోటీ లేకుండానే విజయం లభించింది. ఇందులో బీజేపీ 44, ఏక్నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన పార్టీకి 22, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ రెండు స్థానాలు కైవసం చేసుకున్నాయి. ఈ ఏకగ్రీవ విజయాలపై కూటమి ప్రభుత్వం హర్షం వ్యక్తంచేసింది. కేంద్ర సంస్థలను అడ్డుగా పెట్టుకొని ప్రతిపక్ష అభ్యర్థులను బెదిరించడం, లంచం ఇవ్వడంతో ప్రజాస్వామ్యాన్ని అణగదొక్కారని ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఇక, బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (BMC)తో పాటు 28 కార్పొరేషన్లకు జనవరి 15న ఎన్నికలు జరగనున్నాయి.