మాదక ద్రవ్యాల అక్రమ రవాణా కట్టడి లక్ష్యంగా అగ్రరాజ్యం అమెరికా శనివారం తెల్లవారుజామున వెనెజువెలాపై భారీ వైమానిక దాడులకు దిగింది.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో తమ సైన్యం ఈ దాడులు చేసినట్లు అంతర్జాతీయ మీడియా ధ్రువీకరించగా, రాజధాని కరాకస్‌లోని 7 కీలక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించాయి. సైనిక స్థావరాలు , పౌర నివాసాలే లక్ష్యంగా జరిగిన ఈ దాడుల వల్ల దేశవ్యాప్తంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడటంతో వెనెజువెలా అధ్యక్షుడు నికోలస్ మదురో దేశంలో ‘జాతీయ అత్యయిక పరిస్థితి’ విధిస్తున్నట్లు ప్రకటించారు.
అయితే దాడులకు ముందుగానే అమెరికా విమానయాన సంస్థలు వెనెజువెలా గగనతలాన్ని ఉపయోగించొద్దని యూఎస్ ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ హెచ్చరికలు జారీ చేసింది.మదురో ప్రభుత్వానికి డ్రగ్ మాఫియాతో సంబంధాలున్నాయని ఆరోపిస్తున్న ట్రంప్, ఈ ముఠాలను అంతం చేసేందుకే కరేబియన్ సముద్రంలో యుద్ధ నౌకలు, జలాంతర్గాములు మరియు ఫైటర్ జెట్లను మోహరించారు.ఈ పరిణామాలపై పొరుగు దేశం కొలంబియా తీవ్ర ఆందోళన వ్యక్తం చేయగా, అమెరికా దురాగతానికి వ్యతిరేకంగా ప్రజలంతా వీధుల్లోకి వచ్చి పోరాడాలని మదురో పిలుపునిచ్చారు.ప్రస్తుతం వెనెజువెలాలో యుద్ధ వాతావరణం నెలకొనడంతో అంతర్జాతీయ సమాజం ఈ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది.