విజయ్ హజారే ట్రోఫీలో మొదటి సెంచరీతో చెలరేగిన హార్దిక్ పాండ్య

Spread the love

భారత క్రికెట్ స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా దేశవాళీ టోర్నీలో కూడా తన అద్భుత ఫామ్ తో సత్తా చాటాడు.  విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్‌లో బరోడా తరఫున బరిలోకి దిగిన హార్దిక్ పాండ్యా, తన కెరీర్‌లో తొలి లిస్ట్-ఏ సెంచరీ సాధించాడు. నిరంజన్ షా స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌ లో హార్దిక్ తన బ్యాటింగ్ విన్యాసాలతో ఆకట్టుకున్నాడు. ఈ మ్యాచ్‌ లో బరోడా టీమ్  20 ఓవర్లలో 71 పరుగులకే 5 వికెట్లు కోల్పోయింది. ఏడో స్థానంలో బ్యాటింగ్‌ కు వచ్చి నిదానంగా ఆడుతూ 44 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా దూకుడు పెంచాడు.  ఇన్నింగ్స్ 39వ ఓవర్లో ఏకంగా 5 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 34 పరుగులు రాబట్టి కేవలం 68 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకున్నాడు. మొత్తం 92 బంతులు ఎదుర్కొన్న పాండ్యా, 11 భారీ సిక్సర్లు, 8 ఫోర్లతో 133 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. అతడి అద్భుత ఇన్నింగ్స్ కారణంగా బరోడా జట్టు 50 ఓవర్లలో 293 పరుగుల స్కోరు చేయగలిగింది.