ఆంధ్రప్రదేశ్ ఆత్మనిర్భర్ భారత్ సాధనలో మరో కీలక మైలురాయికి వేదికగా నిలిచిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. వివరాల్లోకి వెళితే మూడు దశల్లో సాగుతున్న విశాఖ రిఫైనరీ ఆధునీకరణ ప్రాజెక్ట్ (VRMP)లో భాగంగా, ఇప్పుడు ఈ రిఫైనరీలో కొత్త రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ (RUF) ఏర్పాటయ్యిందని సీఎం చంద్రబాబు తెలిపారు. విశాఖ రిఫైనరీలో హెచ్‌పిసిఎల్ (HPCL) యొక్క రెసిడ్యూ అప్‌గ్రేడేషన్ ఫెసిలిటీ (RUF) విజయవంతంగా ప్రారంభించబడటంతో, ఇంధన భద్రతను సాధించే దిశగా భారత్ సాగిస్తున్న ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయి నమోదైందని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి ‘ఎక్స్’ లో పోస్ట్ చేశారు. దీనికి బదులిస్తూ చంద్రబాబు ట్వీట్ చేశారు. ఇందులో ప్రపంచంలోనే అత్యంత బరువైన మూడు రియాక్టర్లు ఉండటం విశేషమని పేర్కొన్నారు. ఈ ఆధునీకరణ ప్రాంతీయ ఇంధన అవసరాలను తీర్చడమే కాకుండా, సామాజిక-ఆర్థిక వృద్ధిని కూడా వేగవంతం చేస్తుందన్నారు. దేశ ఇంధన భద్రతను బలోపేతం చేసే దిశగా విశాఖ రిఫైనరీని శక్తివంతం చేయడంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. దీనితో, తూర్పు తీరం (East Coast) ఇప్పుడు ప్రపంచ స్థాయి రిఫైనింగ్ హబ్‌గా అవతరించిందన్నారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఈ కీలక మౌలిక సదుపాయాలు, ప్రధాని నరేంద్ర మోదీ మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దూరదృష్టితో కూడిన నాయకత్వంలో #ఆత్మనిర్భర్ భారత్ దిశగా వేసిన ఒక నిర్ణయాత్మక అడుగని కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ సదుపాయం స్వదేశీ ఇంజనీరింగ్ అద్భుతానికి ప్రతిరూపమని పేర్కొన్నారు. ఇందులో ఒక్కొక్కటి సుమారు 2,200 మెట్రిక్ టన్నుల బరువున్న మూడు LC-Max రియాక్టర్లు ఉన్నాయి. ఇవి ప్రపంచంలోనే అత్యంత భారీ ఇంజనీరింగ్ బ్లాకులలో ఒకటిగా నిలుస్తాయి. విశేషమేమిటంటే, ఇవన్నీ భారత్‌లోనే తయారు చేయబడ్డాయి మరియు అసెంబుల్ చేయబడ్డాయని తెలిపారు.