SIR ముసాయిదా.. ఉత్తరప్రదేశ్ లో  2.89 కోట్ల ఓట్లు తొలగింపు

Spread the love

దేశంలోనే ఎక్కువ జనాభా కలిగిన రాష్ట్రమైన ఉత్తర్ ప్రదేశ్ లో  ఓటరు లిస్ట్ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ను నిర్వహించిన ఎలక్షన్ కమిషన్ ఓటరు ముసాయిదా జాబితాను విడుదల చేసింది. మొత్తం 2.89 కోట్ల మంది ఓటర్లను తొలగించినట్లు తెలిపింది. అందులో 46 లక్షల మంది మరణించారని  పేర్కొంది. 2.17 కోట్ల మంది ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లారని, 25.47 లక్షల మంది ఒకటి కంటే ఎక్కువ చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకొని ఉన్నారని వివరించింది. సమగ్ర సవరణకు ముందు ఉత్తర్ ప్రదేశ్ లో 15.44 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఈ తొలగింపుతో ప్రస్తుతం ఆ సంఖ్య 12.56 కోట్లకు తగ్గింది. ECINET యాప్, ఎన్నికల సంఘం వెబ్సైట్ ద్వారా ఈ డ్రాఫ్ట్ లిస్ట్ లో తమ పేరు ఉందో లేదో తెలుసుకోవచ్చని ఈసీ  అధికారులు తెలిపారు. ఒకవేళ ఎవరి పేరైనా లేకపోయినా  తమ డీటెయిల్స్ లో  తప్పిదాలు ఉన్నా.. ఆన్లైన్, ఆఫ్లైన్ వేదికగా అభ్యంతరాలు సమర్పించే అవకాశం ఉంది. ఆ అభ్యంతరాలను పరిష్కరించిన తర్వాత SIR తుది జాబితా మార్చి 6న విడుదల కానుంది.

ఎస్ఐర్ రెండో దశలో ఛత్తీస్ ఘఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరి ఉన్నాయి. గతేడాది తొలిదశ బిహార్ లో పూర్తయింది. అనంతరం అక్కడ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగాయి. గత నెలలో వెస్ట్ బెంగాల్ లోనూ ముసాయిదా విడుదల చేశారు.  ఈ SIR ను కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇతర విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి.