అనుమతులు ఉన్నా మైనింగ్ కి అడ్డు తగులుతున్నారు: డిప్యూటీ సీఎంకు ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ ఫిర్యాదు

Spread the love

రాష్ట్రాలు, ప్రాంతాలు వేరైనా మనమంతా భారతీయులం. ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా జీవించే హక్కు రాజ్యాంగం కల్పించింది. అలాగే ఏ రాష్ట్రం వారు ఏ రాష్ట్రంలో అయినా పనులు చేసుకోవచ్చని  ఏపీ డిప్యూటీ సీఎం పవన్ స్పష్టం చేశారు. స్థానికేతరుల పేరిట అనుమతులు ఉన్నా పనులు చేయకుండా అడ్డు తగిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.  నేడు వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో మధ్యప్రదేశ్, మాండ్లా పార్లమెంటు సభ్యులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే పవన్ కళ్యాణ్ ని కలిశారు. ఈ మర్యాదపూర్వక భేటీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సదుంలో మధ్యప్రదేశ్ వాసులు గ్రానైట్ మైనింగ్ కి అనుమతులు పొందారని, స్థానిక నాయకులు మైనింగ్ ను అడ్డుకుంటున్నారని డాక్టర్ కులస్తే డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి తీసుకువచ్చారు. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ మైనింగ్ ఎలా చేస్తారని బెదిరింపులకు దిగుతున్నారని చెప్పారు. ఈ అంశంపై పవన్ స్పందిస్తూ అలాంటి చర్యలకు పాల్పడే వారి పట్ల కూటమి ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందని, అనుమతులు ఉన్న వారు నిబంధనలు ప్రకారం మైనింగ్ చేసుకునే ప్రక్రియను అధికార యంత్రాంగం చూస్తుందని స్పష్టం చేశారు.