అమెరికన్ ప్రెసిడెంట్ డోనాల్డ్ ట్రంప్ మరో దూకుడు చర్యకు ముందడుగేశారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ముగించేందుకు ట్రంప్ రష్యాపై మరింత ఒత్తిడి పెంచే దిశగా ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. రష్యాతో వ్యాపారం చేసే దేశాలపై ద్వితీయ ఆంక్షలు విధించే బైలేటరల్ బిల్లుకు ఆయన పచ్చజెండా ఊపారు. రష్యా నుంచి ఆయిల్, యురేనియం కొనుగోలు చేసే దేశాలపై అమెరికన్ ప్రెసిడెంట్ కు 500 శాతం వరకు టారిఫ్ లు పెంచే పవర్ ను ఈ బిల్లు ఇస్తుంది.రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ప్రెసిడెంట్ ట్రంప్‌తో భేటీ అయిన తర్వాత సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని తెలిపారు. ఈ బిల్లు చైనా, భారత్, బ్రెజిల్ వంటి దేశాలపై ఒత్తిడి పెంచి, రష్యా చమురు కొనుగోళ్లు ఆపేలా చేస్తుందని, అది పుతిన్ చేస్తున్న వార్ కు ఫండ్స్ లేకుండా చేస్తుందని గ్రాహం చెప్పారు. ఈ బిల్లు వచ్చే వారం సెనేట్ లో ఓటింగ్‌కు రావచ్చని తెలిపారు.రష్యా నుంచి ఆయిల్ కొనేవారిలో చైనా మొదటి స్థానంలో ఉండగా, భారత్ రెండో స్థానంలో ఉంది. రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లు చేస్తున్న కారణంగా భారత్ పై ట్రంప్ గత ఏడాది 50 శాతం టారిఫ్ లు విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త బిల్లు మరింత కఠినమైన చర్యగా అభివర్ణించవచ్చు.