పొలిటికల్ కన్సల్టెన్సీ ఐప్యాక్ పై ఈడీ (ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్) దాడులు చేపట్టింది. ఆ సంస్థ డైరెక్టర్ ప్రతీక్ జైన్ నివాసంతో పాటుగా ఐప్యాక్ కు సంబంధించిన పలు క్యాంపస్ లలో నేటి ఉదయం నుంచి సోదాలు జరుగుతున్నాయి. మనీలాండరింగ్ కేసుకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా కోల్ కతా సహా పలు ప్రాంతాల్లో ఈసోదాలు కొనసాగుతున్నాయి. కాగా, ఈ రైడ్స్ జరుగుతున్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతీక్ జైన్ నివాసానికి వెళ్లడం తీవ్ర చర్చనీయాంశమైంది.
ఈడీ అధికారులు జైన్ నివాసంలో తనిఖీలు చేస్తుండగా మమతా బెనర్జీ, కోల్ కతా పోలీసు కమిషనర్ మనోజ్ వర్మ అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా మమత మాట్లాడుతూ.. ఈ సోదాలు రాజ్యాంగవిరుద్ధమని ఆరోపించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ సోదాలు చేస్తున్నారని అన్నారు. మా పార్టీ రాజకీయ వ్యూహం, అభ్యర్థుల లిస్ట్, రహస్య సమాచారాన్ని తెలుసుకునేందుకే ఈడీతో ఈ దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు.ఈడీ దాడులు జరుగుతుండగా ప్రతీక్ జైన్ నివాసానికి సీఎం వెళ్లడంపై బెంగాల్ ప్రతిపక్ష నేత,బీజేపీ నేత సువేందు అధికారి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇది ఇన్వెస్టిగేషన్ లో డైరెక్ట్ గా జోక్యం చేసుకోవడమే అవుతుందన్నారు. ఇలాంటి ప్రవర్తన అనైతికం అని ఫైర్ అయ్యారు. ప్రస్తుతం ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతున్నాయి.