నదీ జలాల విషయంలో పక్క రాష్ట్రాలతో వివాదాలు కోరుకోవడం లేదని, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోందని సీఎం రేవంత్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలోని ఈ-సిటీలో నెలకొల్పిన సూజెన్ మెడికేర్ ఫ్లూయిడ్స్ తయారీ యూనిట్ ను సీఎం రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో తెలంగాణ జల వివాదాలను ప్రస్తావించారు. పక్క రాష్ట్రాలతో తెలంగాణ వివాదాలను కోరుకోవడం లేదని న్యాయస్థానాల ముందుకు లేదా మరెవరి వద్దనో పంచాయతీ పెట్టుకునే కన్నా సమస్యపై కూర్చొని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలనే అభిప్రాయం వ్యక్తం చేశారు. నదీ జలాలపై రాజకీయ ప్రయోజనం పొందాలని ప్రభుత్వం భావించడం లేదని, రాజకీయాలకు అతీతంగా చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నామన్నారు.
నీటి వివాదాల విషయంలో తెలంగాణ శాశ్వత పరిష్కారం కోరుకుంటోంది. అభివృద్ధి సాధించాలంటే పక్క రాష్ట్రాల సహకారం, సయోధ్య ఉండాలన్నారు. రాజకీయాలకు అతీతంగా పరిష్కారం కోసం అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. కృష్ణా నదిపై ఉమ్మడి రాష్ట్రంలో మంజూరైన ప్రాజెక్టులకు అడ్డంకులు సృష్టించరాదని ఈ సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశారు. జల వివాదాలపై శాశ్వత పరిష్కారం, రాష్ట్ర ప్రయోజనాలపై వివాదాలను కోరుకోవడం లేదని, సమస్యల పరిష్కారం కోసం సహకరించాలని కోరారు. రాజకీయ ప్రయోజనాలకన్నా ప్రజలు, రైతుల ప్రయోజనాల కోసం ఆలోచన చేస్తున్నామని, పరస్పర సహకారం అవసరమని అన్నారు. పోర్టు కనెక్టివిటీ లేని తెలంగాణకు మచిలీపట్నం పోర్టుతో కనెక్టివిటీ కోసం 12 లేన్ల గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ వే, రైల్వే కనెక్టివిటీతో సహా అనుమతి అడిగామని, ఆ కనెక్టివిటీని అభివృద్ధి చేయాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకారం అవసరమని చెప్పారు.అలాగే, ఏపీ రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలంటే తెలంగాణ సహకారం అవసరం ఉంటుందని, పరస్పరం సహకరించుకుంటేనే సమస్యలు పరిష్కారమవుతాయని అన్నారు.