వాణిజ్య ఒప్పందం అంశంపై కీలక వ్యాక్యలు చేసిన అమెరికన్ మంత్రి లుట్నిక్ 

Spread the love

అమెరికా వాణిజ్య మంత్రి హొవార్డ్ లుట్నిక్ వాణిజ్య ఒప్పందంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వారి దేశ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తో  భారత ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో మాట్లాడకపోవడంతోనే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరలేదని అన్నారు. మామూలుగా అయితే ఒప్పందం కొలిక్కి వచ్చిందని దానికి ముగింపు రావాలంటే ట్రంప్ కు మోదీ కాల్ చేయాల్సి ఉంది. అయితే ఇది భారత ప్రభుత్వానికి రుచించలేదు. మోదీ చివరకు ఫోన్ చేయలేదు. మేము ఇండోనేసియా, ఫిలిప్పీన్స్, వియత్నాంలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకున్నామని ఆయన చెప్పారు.  భారత్ తో ఆ దేశాల కంటే ముందే ఒప్పందం జరుగుతుందని ఊహించామన్నారు.  అలా జరగకపోవడంతో ఇంతకు ముందు అంగీకరించిన వాణిజ్య ఒప్పందాన్ని అమెరికా వెనక్కి తీసుకుందని  దానిపై ఇప్పుడు తాము  ఆలోచించడం లేదని అన్నారు.  బ్రిటన్ తో వాణిజ్య ఒప్పంద చర్చలు కొలిక్కి వస్తున్న తరుణంలో ఆ దేశ ప్రధాని కీర్ స్టార్మర్ ట్రంప్ కు కాల్ చేశారని దీంతో  ఆ రోజే డీల్ ముగింపునకు వచ్చిందని చెప్పారు. ఇక లుట్నిక్ చేసిన వ్యాఖ్యలపై భారత్ స్పందించింది. పలు అంశాలపై  గతేడాది ప్రధాని మోదీ, ట్రంప్ 8 సార్లు ఫోన్లో సంభాషించుకున్నారని విదేశాంగశాఖ స్పష్టం చేసింది. రష్యా చమురు కొనుగోలు చేసే దేశాలపై అమెరికా అదనపు ఆంక్షలు విధించే బిల్లుపైనా అవగాహన ఉందని, పరిణామాలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు  తెలిపింది. ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంపై చర్చించేందుకు 2025 ఫిబ్రవరి 13 నాటికే ఇరు దేశాలు కట్టుబడి ఉన్నాయని  అప్పటి నుంచి రెండు దేశాలకు  ప్రయోజనం చేకూరే వాణిజ్య ఒప్పందం కోసం ఉభయ పక్షాలు  పలుమార్లు సంప్రదింపులు జరిపాయని  ఇప్పటికీ దీనిపై ముందుకు వెళ్లేందుకు ఆసక్తిగా ఉన్నామని భారత విదేశీవ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణ్ ధీర్ జైస్వాల్ పేర్కొన్నారు.