పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘ది రాజా సాబ్’ సినిమా తాజాగా ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సినిమాకు సంబంధించి ప్రస్తుతం సోషల్ మీడియాలో మిక్సెడ్ టాక్ వినిపిస్తున్నప్పటికీ, ప్రభాస్ క్రేజ్ కారణంగా థియేటర్ల వద్ద సందడి నెలకొంది. సినిమా విడుదల కావడానికి ముందురోజు నుంచే అమెరికాలోని పలు ప్రాంతాల్లో, అలాగే తెలుగు రాష్ట్రాల్లో భారీగా ప్రీమియర్ షోలు వేశారు. డార్లింగ్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఈ ప్రీమియర్స్ చూసి సందడి చేశారు. అయితే, ఇంతలోనే సినిమా యూనిట్‌కు పైరసీ రూపంలో ఒక పెద్ద సమస్య వచ్చి పడింది.అమెరికాలోని ఓహాయో రాష్ట్రానికి చెందిన ఒక నార్త్ ఇండియన్ రెస్టారెంట్, ‘ది రాజా సాబ్’ సినిమా పైరేటెడ్ వెర్షన్‌ను తమ రెస్టారెంట్ టెలివిజన్‌లో ప్రదర్శించడం ఇప్పుడు తీవ్ర సంచలనంగా మారింది. దీనికి సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. ఒక ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ఈ విషయాన్ని వీడియో తీసి షేర్ చేస్తూ.. సినిమా విడుదలైన కేవలం ఒక్కరోజులోనే ఆ రెస్టారెంట్ మేనేజ్‌మెంట్ ఇలా పైరేటెడ్ ప్రింట్‌ను పబ్లిక్‌గా ప్లే చేయడం తనను ఆశ్చర్యానికి గురిచేసిందని పేర్కొన్నారు.
అమెరికాలోని డబ్లిన్ నగరంలో జరిగిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. థియేటర్లలో సినిమా రన్ అవుతున్న సమయంలో, ఇలా పైరేటెడ్ వెర్షన్‌ను హోటల్స్ లేదా బహిరంగ ప్రదేశాల్లో ప్రదర్శించడం చట్టపరంగా తీవ్రమైన నేరం. ఇది కాపీరైట్ చట్టాలను ఉల్లంఘించడమేనని, సదరు రెస్టారెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవచ్చని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు ఇంత తొందరగా హై క్వాలిటీ పైరేటెడ్ కాపీ ఎలా బయటికి వచ్చింది? దీని వెనుక ఎవరున్నారు? అనే ప్రశ్నలకు ఇంకా సమాధానాలు లభించలేదు.
గతంలో ఐబొమ్మ (iBomma) రవి వంటి వారిని అరెస్ట్ చేసిన తర్వాత కూడా ఇలాంటి పైరసీ ముఠాలు ఇంకా యాక్టివ్‌గా ఉండటం సినిమా ఇండస్ట్రీకి ఏమాత్రం మంచిది కాదు. వందల కోట్ల బడ్జెట్, నటీనటుల శ్రమ, డైరెక్టర్లు మరియు టెక్నీషియన్ల కష్టం అంతా ఈ పైరసీ వల్ల బూడిదలో పోసిన పన్నీరు అవుతోంది. నిర్మాతలు భారీ నష్టాలను చవిచూడాల్సి వస్తుంది. అసలు ఈ పైరసీ మహమ్మారిని ఎలా ఆపాలి? దీనికి ముగింపు ఎక్కడ? అనేది ఇప్పుడు సినీ పరిశ్రమ ముందున్న అతిపెద్ద ప్రశ్న.