అమరావతి ప్రాంతానికి జగన్‌ వ్యతిరేకం కాదు:వైసీపీ నేత సజ్జల

Spread the love

రాజధాని అంశంపై వైయస్ఆర్ సీపీ కో ఆర్డినేటర్‌ సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన తాజాగా జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానంగా అమరావతిపై జగన్‌గారు మాట్లాడారని ఆయన మాట్లాడిన అంశాలపై సమాధానం చెప్పలేకపోతున్నారని పేర్కొన్నారు. తొలిదశలో 50వేల ఎకరాలు తీసుకున్నారని ఆ రైతులకు ఏమీ చేయలేదని జగన్‌గారు అడిగారని సజ్జల తెలిపారు. రోడ్లు లేవు, కనెక్టివిటీలేదు, ప్లాట్ల డెవలప్‌మెంట్‌లేదనే దానిపై జగన్ మాట్లాడారన్నారు. ఇది చేయకుండానే రెండోదశకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. అమరావతి  రైతుల గోడుని జగన్‌గారు ప్రశ్నించారని సజ్జల వివరించారు. మొదటి దఫా రైతుల సంగతి తేల్చకుండా రెండో దశ పూలింగ్‌ రైతులకు భ్రమల్లో పెట్టే హామీలు ఇస్తున్నారన్నారు. చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో పెట్టింది కేవలం రూ.5వేల కోట్లేనని మొదటి దఫా డెవలప్‌ చేయాలంటే రూ.లక్ష కోట్లు అవుతుంది.ఇలాగే పోతే.. ప్రాజెక్టు ఎప్పటికి అయ్యేది అనే ప్రశ్న జగన్‌గారు లేవనెత్తారని అన్నారు. అమరావతిలో రైతులు టాప్‌ ప్రయార్టీ అని పేర్కొన్నారు. ఈ ప్రశ్నలను జగన్‌గారు లేవనెత్తితే జగన్‌ మీద అనవసరమైన వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. రాయల సీమ లిఫ్ట్‌ అంశాన్ని పక్కకు నెట్టివేసేందుకు నానా వక్రీకరణలకు పాల్పడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రకటన మీద చంద్రబాబు ఇప్పటివరకూ సూటిగా సమాధానం చెప్పలేదని ఇది వదిలేసి… జగన్‌ మీద బూతులతో రెచ్చిపోయారన్నారు. అమరావతి ప్రాంతానికి జగన్‌గారు వ్యతిరేకం కాదని అమరావతిలో కూడా అభివృద్ధి జరగాలని కోరుకున్నారని సజ్జల స్పష్టం చేశారు.