దేశంలో ఇన్నాళ్లుగా నిత్యావసర సరుకుల సరఫరా రంగంలో సాగుతున్న విపరీతమైన పోటీకి, ప్రమాదకరమైన పోకడలకు ఎట్టకేలకు తెరపడింది. కస్టమర్లను ఆకర్షించేందుకు వాణిజ్య సంస్థలు ఆర్భాటంగా ప్రచారం చేసుకుంటున్ 10 మినిట్స్ డెలివరీ విధానానికి స్వస్తి పలకాలని నిర్ణయించారు. బ్లింకిట్, జెప్టో వంటి ప్రముఖ వాణిజ్య సంస్థలు… తమ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నాయి.గత కొంతకాలంగా 10 నిమిషాల్లోనే సరుకులు మీ ఇంటి ముందు అనే నినాదంతో ఈ సంస్థలు బిజినెస్ చేస్తున్నాయి. అయితే, నిర్ణీత సమయంలోపు గమ్యస్థానాన్ని చేరాలన్న ఒత్తిడి కారణంగా, డెలివరీ సిబ్బంది రోడ్లపై అత్యంత వేగంగా, ప్రమాదకరంగా వాహనాలు నడపాల్సి వస్తోందన్న విమర్శలు వెల్లువెత్తాయి. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం, తమ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తించడం వంటి ఘటనలు నిత్యకృత్యమయ్యాయి. దీనివల్ల అనేకమంది యువకులు ప్రమాదాల బారిన పడుతున్నారు.ఈ పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన కేంద్ర ప్రభుత్వం, వెంటనే దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. కేంద్ర కార్మిక ,ఉపాధి కల్పన శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా స్వయంగా రంగంలోకి దిగారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో తదితర సంస్థల ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వ్యాపార లాభాల కోసం కార్మికుల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని, వారి పని పరిస్థితులు అత్యంత ఒత్తిడితో కూడుకున్నవిగా మారాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కచ్చితమైన సమయానికి వెళ్లాలన్న నిబంధనను తక్షణమే సడలించాలని ఆదేశించారు.కేంద్రం ఆదేశాలకు తలొగ్గిన బ్లింకిట్ సంస్థ, తమ నిర్ణయాన్ని వెంటనే అమలులోకి తెచ్చింది. తమ బ్రాండ్ ప్రమోషన్స్ నుండి, యాడ్స్ నుంచి పది నిమిషాలు అన్న పదాన్ని పూర్తిగా తొలగించింది. ఇకపై వినియోగదారులకు నిర్దిష్ట సమయ గడువును వాగ్దానం చేయమని, సురక్షితంగా సరుకులు చేరవేయడానికే తొలి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేసింది. జెప్టో, ఇతర సంస్థలు కూడా ఇదే బాటలో నడవనున్నాయి.