డయాబెటిస్ ఉన్న వారిలో  రెండో స్థానంలో ఉన్న భారత్

Spread the love

డయాబెటిక్ బాధితులు ఎక్కువగా ఉంటున్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉందని ఒక అధ్యయనం తెలిపింది. 2024లో భారత్ లో  9 కోట్ల మంది దీని వలన ప్రభావితమైనట్లు తద్వారా ఈ బాధితులతో 14.8 కోట్ల మందితో చైనా మొదటిస్థానంలో, 3.9 కోట్ల మందితో అమెరికా మూడోస్థానంలో ఉన్నాయని తెలిపింది. ఈ అధ్యయనం వివరాలు ‘ద లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రైనాలజీ’ పత్రికలో పబ్లిష్ అయ్యాయి. అధిక జనాభా కలిగిన చైనా, భారత్, అమెరికా, పాకిస్థాన్ వంటి దేశాలు మధుమేహుల శాతాన్ని  ఎక్కువగా కలిగి ఉన్నాయని రీసెర్చర్స్  తెలిపారు. ఈ విషయంలో 2050 నాటికి పాకిస్థాన్  అమెరికాను దాటేయవచ్చని చెప్పారు. 215 దేశాలకు సంబంధించి 2005 నుంచి 2024 మధ్య జరిగిన 246 అధ్యయనాలను ఎనలైజ్ చేసి, 2050 నాటి పరిస్థితిపై అంచనాలు వేశారు.

2024లో ప్రపంచవ్యాప్తంగా 20 నుంచి 79 ఏళ్ల మధ్య ఉన్నవారిలో 58.9 కోట్ల మంది డయాబెటిస్  బారినపడ్డారు. ఇది ప్రపంచ జనాభాలో 11 శాతం. 2024లో ప్రతి 9 మంది వయోజనుల్లో ఒకరు మధుమేహంతో జీవించారు. ప్రపంచవ్యాప్తంగా డయాబెటిక్ కలిగిన  80 శాతం మంది పేద, మధ్యాదాయ దేశాల్లోనే ఉంటున్నారు. 2050 నాటికి ఈ దేశాల వాటా మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. 75 నుంచి 79 ఏళ్ల మధ్య వయస్కుల్లో 25 శాతం మందిలో ఈ సమస్య ఉంది. మహిళలతో పోలిస్తే పురుషుల్లోనే డయాబెటిక్ శాతం  ఎక్కువ. అలాగే గ్రామాలతో పోలిస్తే పట్టణాల్లోనే వీరి సంఖ్య అధికంగా ఉంది.