సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా ప్రముఖుల నివాళులు

Spread the love

 ఏపీ సీఎం చంద్రబాబు:

‘ఆజాద్ హింద్ ఫౌజ్’ ఏర్పాటు చేసి భరత మాత దాస్య శృంఖలాలను తెంచేందుకు నిర్విరామ కృషి చేసిన మహనీయుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ కు 129వ జయంతి సందర్భంగా ఘన నివాళి అర్పిస్తున్నాను. ఆయన పోరాట పటిమ దేశ పౌరుషానికి ప్రతీకగా ఈనాటికీ చెప్పుకుంటున్నామంటే అది ఆయన ప్రత్యేకత. భారత జాతి కోసం ప్రాణాలకు తెగించి పోరాడతానని ప్రతిజ్ఞ చేసి కార్యాచరణలో చూపిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ మనకు ప్రాత:స్మరణీయుడు.

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్:

పరాక్రమ్ దివస్ సందర్భంగా, అజాద్ హింద్ ఫౌజ్ వ్యవస్థాపకుడు మరియు భారత స్వాతంత్ర్య సమరయోధుడు అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్‌ను నేను స్మరించుకుంటున్నాను. ఆయన అజేయమైన నాయకత్వం బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించింది. ఆయన ధైర్యం మరియు మాతృభూమి పట్ల ఆయనకున్న అచంచలమైన ప్రేమ నేటికీ దేశభక్తిని రగిలిస్తూ, దేశం కోసం నిలబడేలా తరతరాలకు స్ఫూర్తినిస్తున్నాయి.

మాజీ సీఎం జగన్:

`స్వాతంత్ర్యం ఎవరో ఇచ్చేది కాదు.. పోరాటంతోనే సాధించుకోవాలి` అని బలంగా నమ్మి ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించిన స్వాతంత్ర్య సమర యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు. దేశ‌భ‌క్తి,  ధైర్యం, పోరాట ప‌టిమ‌, క్రమశిక్షణే ఆయన జీవన విధానం. నేతాజీ చూపిన పోరాట మార్గం నేటికీ ఆద‌ర్శ‌నీయం. నేడు ఆ మహనీయుడి జయంతి సందర్భంగా మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తున్నాను. 

మంత్రి నారా లోకేష్:

ఆజాద్ హింద్ ఫౌజ్ ను స్థాపించి భారతదేశ స్వాతంత్ర్యం కోసం అవిశ్రాంతంగా పోరాడిన యోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఆ మహనీయుని సేవలను స్మరించుకుంటూ ఘన నివాళులు అర్పిస్తున్నాను.