సాయి పల్లవి ఖాతాలో మరో భారీ సినిమా…?

Spread the love

డిఫరెంట్ క్యారెక్టర్స్ తో ఆచితూచి సినిమాలు ఎంచుకుంటూ, తనకంటూ కెరీర్ లో ఒక సెపెరేట్ దారి వేసుకున్న హీరోయిన్లలో సాయిపల్లవి పేరు ముందు వరుసలో ఉంటుంది. ఆమెకు ఒక అద్భుతమైన ఫాలోయింగ్‌ ఉంది. సింపుల్‌గా కనిపించినా, తెరపై కనిపిస్తే చాలు… ఆమె కోసమే సినిమాకి వచ్చే వాళ్ళు చాల మంది! ప్రస్తుతం సాయిపల్లవి ‘రామాయణ్’ సినిమాలో సీత దేవి పాత్రను పోషిస్తోంది. ఈ పాత్ర కోసం ఆమె తీసుకుంటున్న కేర్‌నే చూస్తే, ఈ ప్రాజెక్ట్ ఎంత స్పెషల్‌గా ఉండబోతుందో అర్థమవుతుంది. ఇదే సమయంలో ఒక హిందీ చిత్రం కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అంతేకాదు… భారతీయ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన దిగ్గజ గాయని ఎమ్మెస్ సుబ్బలక్ష్మి బయోపిక్‌లో సాయిపల్లవి టైటిల్ రోల్ చేయబోతోందన్న వార్తలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. ఇవన్నీ చూస్తుంటే, సాయిపల్లవి కెరీర్ ఎంత డిఫరెంట్ ట్రాక్‌లో సాగుతోందో స్పష్టంగా కనిపిస్తోంది. ఇవన్నీ పక్కనపెడితే… ఇప్పుడు ఆమెకు మరో అనుకోని భారీ అవకాశం వచ్చినట్లు ఇండస్ట్రీలో టాక్ మొదలైంది. అది కూడా పాన్ ఇండియా లెవెల్‌లో సంచలనం సృష్టించిన ఒక ప్రాజెక్ట్‌కు సంబంధించినదే కావడం విశేషం. ప్రభాస్ నటించిన పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘కల్కి 2898 AD’ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ సినిమా సాధించిన విజయం తర్వాత సీక్వెల్‌పై అంచనాలు భారీగా పెరిగాయి. అయితే సీక్వెల్ విషయంలో ఓ కీలక మార్పు జరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో హీరోయిన్‌గా నటించిన దీపికా పదుకొణె సీక్వెల్ నుంచి తప్పుకున్నట్లు గతేడాది అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి “ఆ పాత్రను ఇప్పుడు ఎవరు చేస్తారు?” అనే ప్రశ్న ఇండస్ట్రీలో పెద్ద చర్చగా మారింది.ఇప్పుడు వినిపిస్తున్న సమాచారం ప్రకారం… దీపికా ప్లేస్ లో ఆ కీలక పాత్రకు సాయిపల్లవి పేరు దాదాపు ఖరారైపోయిందట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని టాక్. ఒకవేళ ఈ వార్తలు నిజమైతే, తొలిసారిగా ప్రభాస్ – సాయిపల్లవి జోడీ తెరపై కనిపించనుంది. ఇది అభిమానులకు ఒక డ్రీమ్ కాంబినేషన్‌లా మారే అవకాశం ఉంది. కల్కి దేవుడిని కడుపు లో మోసే పాత్రలో సాయి పల్లవి… అబ్బో సూపర్ కదా! ప్రస్తుతం దర్శకుడు నాగ్ అశ్విన్ సీక్వెల్‌కు సంబంధించిన ప్రీ–ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడని, ఈ వేసవి నుంచే షూటింగ్ ప్రారంభించే ప్లాన్‌లో ఉన్నారని వినిపిస్తోంది. స్క్రిప్ట్, క్యారెక్టర్స్‌పై చాలా జాగ్రత్తలు తీసుకుంటున్న నాగ్ అశ్విన్, ఈసారి కథను మరింత బలంగా తీసుకెళ్లాలని చూస్తున్నాడట. అయితే ఈ రూమర్స్ ఎంతవరకు నిజమో అన్నది మాత్రం మూవీ టీమ్ నుంచి అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది.