మహిళ ఫిర్యాదుపై తక్షణం స్పందించిన డిప్యూటీ సీఎం పవన్…ప్రభుత్వం తరపున భరోసా 

Spread the love

విశాఖపట్నం కేజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా గర్భంలోనే తన శిశువు మృతి చెందిందని ఓ మహిళ చేసిన ఫిర్యాదుపై ఏపీ డిప్యూటీ  తక్షణం స్పందించారు. బాధిత మహిళను కుటుంబంతో సహా సోమవారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయానికి వెంటబెట్టుకుని తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. బాధిత మహిళతోపాటు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి గర్భస్థ శిశువు మృతికి సంబంధించి వివరాలు తెలుసుకోనున్నారు. నిన్నరాత్రి విశాఖ పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణంలో ఉండగా విమానాశ్రయంలో శ్రీమతి పట్నాల ఉమాదేవి అనే మహిళ డిప్యూటీ సీఎం  పవన్ ను కలిశారు. గత ఏడాది డిసెంబర్ మొదటి వారంలో కాన్పు నిమిత్తం కేజీహెచ్ లో చేరగా.. డాక్టర్లు, సిబ్బంది తన పట్ల, తన కుటుంబ సభ్యుల పట్ల నిర్లక్ష్యంగా, ఎంతో అమానవీయంగా ప్రవర్తించారని ఫిర్యాదు చేశారు. కాన్పుకి ఇచ్చిన గడువు పూర్తయ్యిందని తెలిపినప్పటికీ సాధారణ కాన్పు పేరిట నరకం చూపించారని, తన పరిస్థితి అందోళనకంగా ఉందని కుటుంబ సభ్యులు పదేపదే చెప్పినా వినిపించుకోలేదని వాపోయారు. పైగా తన కుటుంబ సభ్యులను తీవ్ర పదజాలంతో దూషించారని, కాన్పు సమయంలో తన గుండెల పైకి ఎక్క కూర్చుని సాధారణ కాన్పు పేరిట అమానవీయంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు.  చివరి నిమిషం వరకు సిజేరియన్ నిర్ణయం తీసుకోకపోవడం కారణంగా మృత శిశువుకి జన్మనివ్వాల్సి వచ్చిందని ఆమె చెప్పారు. కేజీహెచ్ సిబ్బంది తీరుతో శారీరక హింసతోపాటు జీవితకాలం మనో వేదన మిగిల్చిందంటూ బాధను వ్యక్తం చేశారు.  తన లాంటి దుస్థితి మరో మహిళకు రాకుండా వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని వేడుకున్నారు. ఆ మహిళ వేదన విని చలించిన డిప్యూటీ సీఎం పవన్ ప్రభుత్వం తరఫున తగిన భరోసా ఇవ్వాలని నిర్ణయించారు.