ఈ ఏడాది టీ 20 వరల్డ్ కప్ ట్విస్టుల మీద ట్విస్టులతో ప్రారంభానికి ముందే ఉత్కంఠ రేకెత్తిస్తోంది. ఈనెల 7 నుండి ప్రారంభం కానున్న ఈ మెగా టోర్నీకి భారత్-శ్రీలంకల ఆతిథ్యం ఇస్తుండగా..వరల్డ్ కప్ లో భారత్ తో లీగ్ మ్యాచ్ బహిష్కరిస్తున్నట్లు పాకిస్థాన్ ప్రకటించింది. ఇటీవలే ఈ టోర్నీలో ఆడేందుకు పాకిస్థాన్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ భారత్ తో మాత్రం మ్యాచ్ ఆడబోమంటూ తమ నిర్ణయాన్ని ఎక్స్ లో తెలిపింది. 2026 టీ20 ప్రపంచకప్ లో ఆడేందుకు పాకిస్థాన్ క్రికెట్ జట్టుకు పాకిస్థాన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఫిబ్రవరి 15న భారత్ తో మ్యాచ్ మాత్రం పాక్ ఆడదని పాకిస్థాన్ ప్రభుత్వం పేర్కొంది. అయితే బహిష్కరించడానికి కారణాన్ని మాత్రం పాక్ చెప్పలేదు. కానీ బంగ్లాదేశ్ కు మద్దతుగానే పాక్ ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. సెక్యూరిటీ రీజన్స్ తో వరల్డ్ కప్ లో తమ మ్యాచ్ లను భారత్ నుంచి తరలించాలన్న తమ డిమాండ్ ను ఐసీసీ అంగీకరించకపోవడంతో బంగ్లాదేశ్ ఈ టోర్నీకి దూరమైన విషయం తెలిసిందే. అప్పటి నుంచి పాక్ బంగ్లాకు మద్దతుగా మాట్లాడుతోంది. టోర్నీని బహిష్కరిస్తామని కొన్నిసార్లు, భారత్ మ్యాచ్లను ఆడమని ఇంకొన్నిసార్లు బెదిరించింది. పాక్ తన మ్యాచ్లన్నింటినీ శ్రీలంకలోనే ఆడనుంది. ఐసీసీ ప్రపంచకప్ లో బంగ్లాదేశ్ స్థానాన్ని స్కాట్లాండ్ తో భర్తీ చేసింది.