బెంగాల్ లో నిర్వహిస్తున్న ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్’ (SIR) ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ప్రక్రియలో ఏవైనా ఆదేశాలు, క్లారిటీ అవసరమైతే తాము కల్పించుకుంటామని తెలిపింది. అంతే తప్ప ‘సర్’ ప్రక్రియలో అడ్డంకులు కల్పించే ప్రయత్నాలు చేయవద్దని బెంగాల్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఈ విషయాన్ని అన్ని రాష్ట్రాలు అర్థం చేసుకోవాలని స్పష్టం చేసింది. సర్ కోసం 300మంది ఆఫీసర్లను కేటాయించాలని బెంగాల్ ప్రభుత్వాన్ని కోరితే 80 మంది గ్రేడ్-2 స్థాయి అధికారులనే కేటాయించిందని కోర్టుకు ఎన్నికల సంఘం తెలిపింది. మరోవైపు ఎన్నికల సంఘం అధికారులు రాష్ట్రాన్నిటార్గెట్ గా చేసుకున్నారని, అర్హులైన ప్రజలను ఓటర్ల లిస్ట్ లో చేర్చడం లేదని బెంగాల్ ప్రభుత్వం తెలిపింది. ఇంటి పేర్లలో అక్షరదోషాలు, పెళ్లి తర్వాత మహిళల అడ్రెస్ లలో మార్పులు వంటి చిన్న లోపాలను చూపిస్తూ ఓట్లు తొలగిస్తున్నారని ధర్మాసనానికి వివరించింది. దీనివల్ల 1.36 కోట్ల మంది ఓటర్లు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. తమ స్థానికత నిరూపించుకునేందుకు ఓటర్లకు ఈసీ ఒక్క అవకాశమూ ఇవ్వలేదని బెంగాల్ ప్రభుత్వం కోర్ట్ కు తెలిపింది. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ రాష్ట్రంలో ఓటర్ల అప్లికేషన్లు పూర్తి చేయడానికి, డేటాను ఖరారు చేయడానికి గడువును ఒక వారం పొడిగిస్తున్నట్లు తెలిపింది.