మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న మూవీ ‘పెద్ది’. ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతి బాబు ‘అప్పలసూరి’ అనే పాత్రలో నటిస్తున్నారు. ఇంతకుముందెప్పుడూ కనిపించని సరికొత్త లుక్ లో ఆయన కనిపించారు. ఇప్పటికే ఆయన లుక్ కు సంబంధించి విడుదల చేసిన పోస్టర్ తో ప్రేక్షకులలో మంచి ఆసక్తిని కలిగించారు. ఇక నేడు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని మూవీ టీమ్ శుభాకాంక్షలు తెలిపింది. నట దిగ్గజం జగపతి బాబు గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు! ‘అప్పలసూరి’గా ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుందని పేర్కొంది. డైరెక్టర్ బుచ్చిబాబుతో కూర్చుని వున్న జగపతి బాబు ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. ఇక ఈ మూవీలో చరణ్ కు జోడిగా జాన్వీ కపూర్ నటిస్తుంది.ఈ చిత్రాన్ని సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో, వృద్ధి సినిమాస్ పతాకంపై వెంకట సతీష్ కిలారు ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ ముఖ్య పాత్ర పోషిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఈచిత్రం పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ కు ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ లభించింది. 2026 ఏప్రిల్ 30న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది.