మెగా కుటుంబ వేడుకలపై ఒక వివాదాస్పద ట్వీట్‌కు నటి లావణ్య త్రిపాఠి గట్టిగా స్పందించిన తీరు ఇటీవల సోషల్‌మీడియాలో పెద్ద చర్చగా మారిన సంగతి తెలిసిందే. తాజాగా తన కొత్త చిత్రం ‘సతీ లీలావతి’ ఈవెంట్ లో పాల్గొన్న లావణ్య, మరోసారి ఇదే అంశంపై మాట్లాడారు. “నా కుటుంబానికి నేను అండగా నిలబడటం సహజం. ఎవరు తప్పుగా మాట్లాడినా నేను మౌనంగా ఉండను” అని ఆమె ధైర్యంగా చెప్పిన మాటలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తనకు అత్యంత ప్రియమైన వారిని కాపాడేందుకు వెనుకాడని వ్యక్తిత్వం ఆమెదని చాలామంది ప్రశంసిస్తున్నారు. ఇక లావణ్య త్రిపాఠి, దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సతీ లీలావతి’ చిత్రానికి తాతినేని సత్య దర్శకత్వం వహించారు. మార్చి 6న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాపై చిత్రబృందం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో లావణ్య పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా ద్వారా భార్యాభర్తల మధ్య పరస్పర మద్దతు ఎంత ముఖ్యమో చెప్పాలనుకుంటున్నామని ఆమె వెల్లడించారు. “భార్యాభర్తలు కేవలం దంపతులుగానే కాదు… మంచి స్నేహితులుగా ఉంటే జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది” అని ఆమె ఎమోషనల్ గా చెప్పారు.అలాగే చాలా గ్యాప్ తర్వాత సినిమాతో వస్తున్న విషయంపై మాట్లాడిన లావణ్య, తాను నటనను ఎప్పటికీ వదిలిపెట్టనని స్పష్టం చేశారు. జెన్-జీ అమ్మాయిల పెళ్లి గురించి సందేహాలపై స్పందిస్తూ… మంచి వ్యక్తి అయితే తప్పకుండా పెళ్లి చేసుకోవచ్చని, అయితే సమయం తీసుకుని ఆ వ్యక్తిని బాగా అర్థం చేసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలని సూచించారు.