కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని నోటీసు

Spread the love

లోక్ సభ సమావేశాలలో అధికార విపక్ష కూటముల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. తాజాగా లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ  రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దు చేయాలని బీజేపీ ఎంపీ నిశికాంత్ దుబే డిమాండ్ చేశారు. ఎంపీగా రాహుల్ ను  తొలగించడంతోపాటు జీవితంలో ఎప్పుడూ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేకుండా వేటు వేయాలని కోరుతూ నోటీసు సమర్పించారు. ప్రాధాన్యమున్న అంశాలపై సభ చర్య తీసుకునేందుకు ప్రతిపాదించే ‘సబ్‌స్టాంటివ్ మోషన్’ ను తాను కోరుతున్నట్లు దుబె పేర్కొన్నారు. రాహుల్ తరచూ థాయ్లాండ్, వియత్నాం, కంబోడియా వంటి దేశాలకు వెళ్తూ సారోస్ ఫౌండేషన్, యూఎస్ఎయిడ్, ఫోర్డ్ ఫౌండేషన్ వంటి సంస్థలతో చేతులు కలిపి.. భారత్ వ్యతిరేక శక్తులతో కుమ్మక్కు అవుతున్నారని ఆరోపించారు. అందువల్ల ఎంపీగా ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాలని జీరోఅవర్ లో  డిమాండ్ చేశారు.రాహుల్ సోషల్ మీడియాలో  స్పందిస్తూ తనపై తీర్మానం పెట్టినా, కేసు పెట్టినా, ఇంకేం చేసినా కూడా రైతుల తరపున బలంగా పోరాడతానని స్పష్టంచేశారు. తన అన్నయ్యను ఎవరూ బెదిరించలేరని రాహుల్ గాంధీ  సోదరి, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకాగాంధీ వాద్రా స్పష్టం చేశారు. ఇటీవల పార్లమెంట్ సమావేశాల్లో రాహుల్ గాంధీ ప్రభుత్వంపై చేసిన కొన్ని వ్యాఖ్యలు (ముఖ్యంగా భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై మరియు మాజీ ఆర్మీ చీఫ్ ఎం.ఎం. నరవణే పుస్తకం గురించి చేసిన ప్రస్తావనలు) ఈ వివాదానికి దారితీశాయి. రాహుల్ గాంధీ దేశాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని అధికార పక్షం వాదిస్తోంది.