భారీ నష్టాలతో ట్రేడింగ్ ముగించిన దేశీయ స్టాక్ మార్కెట్లు

Spread the love

ఈరోజు ట్రేడింగ్ లో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. ఇంటర్నేషనల్ మార్కెట్ల నుండి ప్రతికూల సంకేతాలకు తోడు ఐటీ, మెటల్ స్టాక్స్ లో అమ్మకాలు మార్కెట్ సూచీల జోరు తగ్గించాయి. సెన్సెక్స్ 1000 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 25 ,500 మార్కుకు దిగువన ముగిసింది. ఇన్వెస్టర్ల సంపద రూ.7 లక్షల కోట్లు పోయింది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లో నమోదిత కంపెనీల విలువలో తగ్గుదల కనిపించింది. బీ.ఎస్.ఈ సెన్సెక్స్  1,048 పాయింట్లు కోల్పోయి 82,626 వద్ద ట్రేడింగ్ ముగించింది. నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ నిఫ్టీ 336 పాయింట్లు నష్టపోయి 25,471 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఎస్.బీ.ఐ, బజాజ్ ఫైనాన్స్, ఐషర్, సిప్లా షేర్లు లాభాలతో ముగించాయి. ఇక ఇటీవల చూసుకుంటే అమెరికాకు చెందిన AI స్టార్టప్ ‘ఆంథ్రోపిక్’ కొత్త టెక్నాలజీని విడుదల చేయడంతో, భారతీయ ఐటీ కంపెనీల భవిష్యత్తుపై ఆందోళనలు మొదలయ్యాయి. అమెరికా మార్కెట్లలో టెక్ షేర్లు పతనం కావడం భారత మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. మార్కెట్ నిపుణుల ప్రకారం, ఇది తాత్కాలిక ఒడిదుడుకు మాత్రమే కావచ్చు. నాణ్యమైన ఐటీ మరియు బ్యాంకింగ్ షేర్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది ఒక అవకాశంగా కూడా చూడవచ్చని కొందరు విశ్లేషిస్తున్నారు.