టీ20 వరల్డ్ నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) ఛైర్మన్ నఖ్వి పై విమర్శలు అంతకంతకూ పెరుగుతూనే ఉన్నాయి. పాక్ మంత్రి కూడా అయిన అతడిపై అక్కడి మాజీలు, క్రీడాభిమానులు మండిపడుతున్నారు. వరల్డ్ కప్ లో ఆడమని, భారత్ తో మ్యాచ్ ను బాయికాట్ చేస్తామని ఓసారి అన్నాడు. భారత్ కు వ్యతిరేకంగా మాట్లాడుతూ వార్తల్లో నిలిచాడు.అయితే ఇంత తతంగం అయిన తరువాత చివరికి భారత్ తో ఆడాలని పాక్ నిర్ణయించుకుంది. మ్యాచ్ లో ఎప్పటిలాగే టీమ్ ఇండియా చేతిలో ఘోర పరాజయం మూటగట్టుకుంది. టీ20 వరల్డ్ కప్ లో పాక్ పై గెలుపోటముల రికార్డును భారత్ 8-1కి పెంచుకుంది. ఈ నేపథ్యంలో నఖ్విపై పాక్ లోనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.నఖ్వి అసమర్థుడని పాక్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ మండిపడ్డాడు. మ్యాచ్ లో మా జట్టు అసలు పోటీలోనే లేదు. షహీన్ 125 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేశాడు. మోడ్రన్ క్రికెట్లో ఇది సరిపోదు. ఈ ఆటగాళ్లు ఒత్తిడిని ఎదుర్కోలేరు. గత 15-20 ఏళ్లలో ఆటగాళ్లలో స్కిల్స్ పెంచడానికి పాకిస్థాన్ ఎలాంటి పెట్టుబడి పెట్టలేదు.ఆందోళనకర విషయం ఏమిటంటే ఇప్పుడు భారత్ ను ఓడించినట్లు కల కూడా కనలేమని అన్నాడు. ఎలాంటి జ్ఞానం లేని ఓ వ్యక్తి పీసీబీ చైర్మన్ అయ్యాడు. అలాంటి వ్యక్తి ఏం చేస్తాడు? జట్టును ఎలా నడిపిస్తాడు? జట్టులో ఓ సూపర్ స్టార్ (బాబర్ అజామ్)ను తయారు చేశారు. అతడు మ్యాచ్ ను గెలిపించలేడు. అసమర్థులకు బాధ్యతలు అప్పగించడం ప్రపంచంలోనే అతి పెద్ద నేరమని అక్తర్ చెప్పాడు. చేతకాని నఖ్వికి పీసీబీ ఛైర్మన్ గా ఉండే అర్హత లేదని అక్తర్ విమర్శించాడు. పీసీబీ ఛైర్మన్ గా నఖ్వి తీరు వివాదాస్పదమవుతూనే ఉంది. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఛైర్మన్ హోదాలో ఉన్న అతడి నుంచి ట్రోఫీ గతేడాది ఆసియాకప్ అందుకోవడానికి భారత జట్టు నిరాకరించింది. దీంతో అతడు ట్రోఫీని పట్టుకుపోయాడు.