పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టైలిష్ యాక్షన్ మూవీస్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఒక పవర్ ఫుల్ సినిమాను తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు కథా ప్రముఖ రచయిత వక్కంతం వంశీ అందించనుండటం మరో ప్రత్యేకతగా మారింది. గతంలో ఆయన రాసిన కథలతో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. అందుకే పవన్ కళ్యాణ్ వంటి స్టార్‌కు ఆయన కథ రాయడం ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ సినిమా జూన్ నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. నిర్మాణ బాధ్యతలను నిర్మాత రామ్ తాళ్లూరి చేపట్టనుండగా, భారీ స్థాయిలో ఈ సినిమాను రూపొందించే ప్రణాళికలో ఉన్నట్లు తెలుస్తోంది. అన్ని కార్యక్రమాలు అనుకున్నట్టుగా సాగితే 2027 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. సంక్రాంతి సీజన్‌లో పవన్ సినిమా రావడం అంటే బాక్సాఫీస్ వద్ద భారీ సంబరమే అవుతుంది.
ఇదిలా ఉండగా, ఈ చిత్రంలో కథానాయిక ఎంపికపై ఇటీవల ఆసక్తికరమైన చర్చలు మొదలయ్యాయి. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా అవకాశం యువ నటి ఇమాన్వీకి దక్కిందనే వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ స్థానంలో ఇప్పుడు యువ కథానాయిక సాక్షి వైద్య పేరు ఖరారైనట్లు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘నారీ నారీ నడుమ మురారి’ సినిమాతో ఆమెకు మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు, నటిగా మరోసారి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. అందుకే పవన్ కళ్యాణ్ సినిమాకు ఆమెను ఎంపిక చేసినట్లు సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.సాక్షి వైద్యకు దర్శకుడు సురేందర్ రెడ్డితో ఇది రెండో సినిమా. ఆమె డెబ్యూ సినిమా ఏజెంట్ కూడా సురేందర్ రెడ్డి దర్శకత్వంలోనే వచ్చింది. మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇప్పుడు మరోసారి అదే దర్శకుడి నుంచి గ్రీన్ సిగ్నల్ రావడం, ఆమె కెరీర్‌కు పెద్ద మైలురాయిగా భావిస్తున్నారు. స్టార్ హీరో సినిమా ద్వారా ఆమె మరింత పెద్ద స్థాయికి చేరుకునే అవకాశం ఉందని పరిశ్రమలోని పలువురు విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.