అమెరికా నార్త్ ఈస్ట్ ప్రాంతంలో భారీ మంచు తుపాను భీబత్సం సృష్టిస్తోంది. మేరీల్యాండ్ నుంచి మైన్ వరకు విస్తరించిన ఈ మంచు తుఫాన్ కారణంగా కోట్లాది మంది ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. దశాబ్ద కాలంలో ఇదే అత్యంత తీవ్రమైన తుపాను అని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఈ తుపానును వాతావరణ నిపుణులు ‘బాంబ్ సైక్లోన్’ గా అభివర్ణించారు. ఈ మంచు తుపాను కారణంగా న్యూయార్క్, బోస్టన్, ఫిలడెల్ఫియా వంటి ప్రధాన నగరాల్లో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. పలు ప్రాంతాల్లో 60 సెంటీమీటర్ల కంటే ఎక్కువ మంచు పేరుకుపోయినట్లు చెబుతున్నారు. న్యూయార్క్ నగరంలో గడిచిన ఆరేళ్లలో పూర్తిస్థాయిలో పాఠశాలలకు సెలవు ప్రకటించడం ఇదే మొదటిసారి. అధికారులు పలు రాష్ట్రాల్లో ఎమర్జెన్సీ ప్రకటించారు. భారీ గాలులు, హిమపాతం కారణంగా రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. న్యూయార్క్, న్యూజెర్సీ, బోస్టన్లోని ఎయిర్ పోర్టులపై తీవ్ర ప్రభావం పడింది. మొత్తం మీద 5,600కు పైగా ఫ్లైట్ సర్వీసులు రద్దయ్యాయి. రోడ్ ఐలాండ్ లో ఎయిర్ పోర్ట్ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేశారు. పలు నగరాల్లో బస్సులు, రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా 4.5 లక్షలకు పైగా ఇళ్లకు ఎలక్ట్రిక్ సప్లై నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటకు 83 మైళ్ల వేగంతో గాలులు వీచాయి.