ప్రైవేట్ కాలేజీలకు ధీటుగా గవర్నమెంటు కాలేజీలు:మంత్రి లోకేశ్  

Spread the love

ఏపీలోని గవర్నమెంటు జూనియర్ కాలేజీల్లో ఉన్న ఖాళీలను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడంతో పాటు  ప్రైవేటు కాలేజీలకు ధీటుగా వాటిని తీర్చిదిద్దనున్నట్లు  విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ స్పష్టం చేశారు. ఈరోజు శాసన మండలిలో  అనంతపురం జిల్లాలోగవర్నమెంటు  జూనియర్ కాలేజీల మంజూరుపై సభ్యుడు ఏ. శివరామిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లోకేశ్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వంలో విద్యావ్యవస్థ బలోపేతానికి కట్టుబడి ఉన్నట్లు పేర్కొన్నారు.  ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్తగా 9 గవర్నమెంటు  జూనియర్ కళాశాలలను మంజూరు చేసినట్టు వివరించారు. వీటిలో అన్నింటికీ టీచింగ్ స్టాఫ్, 5 కళాశాలలకు నాన్ టీచింగ్ స్టాఫ్  పోస్టులను కూడా మంజూరు చేశామని వివరించారు. అయితే, గత వైసీపీ ప్రభుత్వ హయాంలో విద్యాశాఖ తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని విమర్శించారు. నేను విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పుడు, గవర్నమెంటు స్కూల్స్, జూనియర్ కాలేజీల్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నారో, ఏ టీచర్ ఎక్కడ పనిచేస్తున్నారో కూడా సరైన డేటా లేదు. ఆ సమాచారాన్ని సేకరించడానికే నాకు 20 నెలల సమయం పట్టిందని లోకేశ్ తెలిపారు.

గవర్నమెంటు  జూనియర్ కాలేజీల అభివృద్ధికి తమ ప్రభుత్వం సమగ్ర ప్రణాళికతో ముందుకెళ్తోందని లోకేశ్ వివరించారు. ప్రైవేటు కాలేజీలకు దీటుగా ప్రభుత్వ కాలేజీలను తీర్చిదిద్దుతాం. అవసరమైన టీచర్స్ ను నియమిస్తాం. ల్యాబ్‌లు ఏర్పాటు చేస్తాం. పోటీ పరీక్షలకు అవసరమైన మెటీరియల్ కూడా అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. అలాగే ఇంటర్మీడియట్ విద్యలో మధ్యాహ్న భోజన పథకాన్ని తిరిగి ప్రారంభించామని, విద్యార్థులకు అవసరమైన బుక్స్  ఉచితంగా అందిస్తున్నామని లోకేశ్‌ తెలిపారు.  జూనియర్ కాలేజీల్లో ఖాళీల భర్తీ ప్రక్రియను అత్యంత వేగంగా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు సభకు వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *