తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో జరిగిన మంత్రిమండలి సమావేశం ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, భద్రతకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉద్యోగులకు పూర్తి భద్రత, భరోసా కల్పించేందుకు రెండు కొత్త పథకాలకు ఆమోదం తెలిపింది. ఎంప్లాయిస్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ పధకం దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వం ప్రస్తుతం రాష్ట్రంలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ఒక్క రూపాయి ప్రీమియం చెల్లించాల్సిన అవసరం లేకుండా ఈ పథకానికి ఆమోదం తెలిపింది. తొలిసారిగా సింగరేణిలో, ట్రాన్స్‌కోలో ఉద్యోగులకు విజయవంతంగా అమలు చేస్తున్న పథకం తరహాలోనే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు అందరికీ ఈ పథకాన్ని విస్తరించింది. ఉద్యోగులు ఎవరైనా ప్రమాదంలో మరణిస్తే రూ. 1.2 కోట్లు బీమా పరిహారం అందుతుంది. 60 ఏళ్ల వరకు సహజ మరణానికి ఉద్యోగులకు రూ.10 లక్షల టర్మ్ ఇన్సూరెన్స్ ప్రయోజనం లభిస్తుంది. రాష్ట్రంలో ప్రభుత్వ, కార్పొరేషన్లు, ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలో 5.19 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు, వీరితో పాటు 2.38 లక్షల మంది పెన్షనర్లు కలిపి మొత్తం 7.57 లక్షల మందికి ఈ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ సౌకర్యం వర్తిస్తుంది. ఎప్పటి నుండో గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఎదురుచూస్తున్నహెల్త్ సెక్యూరిటీ కు క్యాష్‌లెస్ ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ (EHS) అమలుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 3 లక్షల 56 వేల మంది ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులతో పాటు 2.88 లక్షల మంది పెన్షనర్లు, వారిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు మొత్తం 17.07 లక్షల మందికి ఈ పధకం వర్తిస్తుంది. తాజా స్కీమ్‌తో ఇకపై గవర్నమెంట్ ఎంప్లాయిస్ హాస్పిటల్స్ లో ఒక్క రూపాయి చెల్లించాల్సిన అవసరం లేకుండానే ట్రీట్మెంట్స్ అందుతాయి. అన్ని గవర్నమెంట్ హాస్పిటల్స్ తో పాటు 652 ప్రైవేట్ ఎంపానెల్ హాస్పిటల్స్‌లో ఈ పథకం వర్తిస్తుంది. దీనిపై మొత్తం 1998 రకాల వైద్య చికిత్సలు అందిస్తారు.