శ్రీకాకుళంలో ఇటీవల నమోదైన డయేరియా ప్రభావిత ప్రాంతాలను కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు సందర్శించారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ప్రభావిత ప్రాంతాల్లో సురక్షిత తాగునీటి సరఫరా మరియు పారిశుధ్య సదుపాయాలు మెరుగుపరచాలని అధికారులను ఆదేశించారు. అలాగే సమస్య పూర్తి గా తీరే వరకు సరైన పారిశుధ్యం మరియు పరిశుభ్రత పద్ధతులను పాటించాలని ప్రజలకు సూచనలు ఇచ్చారు. ఇటీవల హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయిన రోగులను వారి ఇంటి వద్ద కలిసి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. తక్షణ సహాయార్ధం నిత్యవసర వస్తువుల కిట్స్ అందించారు. అనంతరం ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ (RIMS) మరియు KIMS ఆసుపత్రులను సందర్శించి ట్రీట్మెంట్ తీసుకుంటున్న రోగులను పరామర్శించారు. అవసరమైన వైద్య సహాయం పూర్తి స్థాయిలో అందించి, త్వరితగతిన కోలుకునేలా చర్యలు తీసుకోవాలని హాస్పిటల్ యాజమాన్యాన్ని ఆదేశించారు.ప్రభుత్వం ప్రజలకు అవసరమైన ప్రతి సహాయం అందించేందుకు కట్టుబడి ఉందని భరోసానిచ్చారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా సమగ్ర నివారణ చర్యల ప్రణాళిక సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.