కూల్చిన చోటే ఇండ్లు కట్టించే బాధ్యత మాది..బాధితులకు కే.టీ.ఆర్ హామీ

Spread the love

ఖమ్మం వెలుగుమట్లలో కాంగ్రెస్ ప్రభుత్వం  చేపట్టిన ఇళ్ల కూల్చివేత బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమ వద్ద ఉన్న భూమి పట్టా కాగితాలు, ప్రభుత్వానికి కట్టిన ఆస్తి పన్ను రశీదులు, ఇంటి పన్ను కాగితాలు మరియు విద్యుత్ కనెక్షన్ కోసం కట్టిన డీడీలను కేటీఆర్ గారికి చూపించారు. బాధితుల వద్ద ఉన్న అన్ని రకాల ధృవీకరణ పత్రాలను పరిశీలించిన కేటీఆర్ ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. పేదలకు ఇళ్లు కట్టించి ఇవ్వాల్సిన “ఇందిరమ్మ రాజ్యం”లో, ఉన్న ఇళ్లను కూలగొట్టడం అన్యాయమని దుయ్యబట్టారు. ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు మరియు కోర్టు ఆర్డర్లు ఉన్నప్పటికీ, కనీస నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని ఫైర్ అయ్యారు. ఖమ్మంలో 150 ఇళ్లతో పాటు, మహబూబ్ నగర్‌లో దివ్యాంగుల ఇళ్లను కూడా కూల్చివేయడం ఈ ప్రభుత్వ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. కేవలం ఆర్డీవోను బదిలీ చేస్తే సరిపోదని, బాధితులకు న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. కూల్చివేతకు గురైన కుటుంబాలకు కేటీఆర్ అందరికీ మళ్ళీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి, గృహప్రవేశాలు చేయించే బాధ్యత తనదని  హామీ ఇచ్చారు. ఈ పోరాటంలో భాగంగా కలెక్టర్ మరియు చీఫ్ సెక్రటరీలను కలిసి బాధితుల పక్షాన నిలబడతామని భరోసానిచ్చారు. శాసనసభ, శాసనమండలి వేదికలుగా ఈ అన్యాయాన్ని ప్రశ్నిస్తామని, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. పేదల పక్షాన పోరాడాలని కేసీఆర్ ప్రత్యేకంగా చెప్పారని, బాధితులు ఐకమత్యంగా ఉండాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *