పలు దేశాల్లో పరిణామాలు అంతర్జాతీయంగా కలకలం రేపుతున్నాయి. ఒక పక్క పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు కొనసాగుతుండగా…పాకిస్థాన్-ఆఫ్ఘనిస్థాన్ ల మధ్య ఉద్రిక్తతలు అదే స్థాయిలో జరుగుతున్నాయి. పాకిస్థాన్ లోని కీలక సైనిక స్థావరాలపై తమ ఎయిర్ ఫోర్స్ దాడులు నిర్వహించిందని ఆప్ఘనిస్థాన్ డిఫెన్స్ శాఖ తెలిపింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు క్వెట్టాలోని 12వ కార్ప్స్ ప్రధాన కార్యాలయం, ఖైబర్ పఖ్తుంఖ్వాలోని పలు కీలకమైన పాక్ సైనిక స్థావరాలను కూడా టార్గెట్ గా చేసుకున్నట్లు తెలిపింది. తమ దేశంలోని వివిధ ప్రాంతాలపై పాకిస్థాన్ ఎయిర్ స్ట్రైక్స్ నిర్వహించిందని ఆందోళన వ్యక్తం చేసింది. పాకిస్థాన్ సైనిక చొరబాట్లకు ప్రతీకారదాడులుగా వీటిని నిర్వహించినట్లు ఆప్ఘనిస్థాన్ రక్షణ శాఖ ప్రకటించింది. తాము చేసిన దాడిలో నూర్ ఖాన్ ఎయిర్ బేస్‌తో పాటు పలు సైనిక స్థావరాలు దెబ్బతిన్నట్లు తెలిపింది. ఆప్ఘనిస్థాన్ లోని జలాలాబాద్ లో పాకిస్థాన్ ఫైటర్ జెట్ ను కూల్చివేసినట్లు తాలిబన్లు తెలిపారు. విమాన పైలట్ తమ అదుపులో ఉన్నట్లు తెలిపింది.