ప్రపంచానికి తెలంగాణను గేట్ వే గా మార్చాలన్న సంకల్పంతో ప్రభుత్వం పని చేస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రజలకు పాలనను మరింత చేరువ చేయడం, సమస్యల పరిష్కారంలో వేగం, పారదర్శకత జోడిస్తూ అధికార యంత్రాంగాన్ని ప్రజా సమక్షానికి నడిపించే గొప్ప ఆలోచనతో మార్చి 6 నుండి జూన్ 12 వరకు “ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక” పేరుతో 99 రోజుల కార్యచరణ ప్రణాళికను ఆవిష్కరించారు. ఈ బృహత్తర కార్యక్రమంలో గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ మొదలు… సీఎం వరకు ఇటు ప్రజా ప్రతినిధుల వ్యవస్థ, అటు కార్యనిర్వాహక వ్యవస్థ సమన్వయంతో పని చేయాల్సిన అవసరం ఉందన్నారు. దీని కోసం ఈ రోజు జిల్లా కలెక్టర్లు, ఆయా శాఖల కార్యదర్శులతో రాష్ట్ర సచివాలయంలో దిశానిర్ధేశం చేస్తూ సమీక్ష నిర్వహించారు.మార్చి 6 నుంచి 99 రోజుల పాటు 5 దశల్లో యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ప్రణాళిక శాఖ ఈ కార్యక్రమానికి నోడల్ శాఖ గా వ్యవహరిస్తుంది. ఏప్రిల్ 2న గ్రామ స్థాయిలో గ్రామ సభల నిర్వహణ…ఏప్రిల్ 16న మండల స్థాయిలో కార్యక్రమం… మే 2న నియోజకవర్గ స్థాయి కార్యక్రమం… మే 22న జిల్లా స్థాయిలో కార్యక్రమం… జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ వేడుక ఘనంగా నిర్వహించేలా ఈ ప్లాన్ ఉండనుంది.ఇక శాఖల వారీగా 10 థీమ్ లతో 99 రోజుల కార్యక్రమాలు నిర్వహించబోతున్నట్లు తెలిపారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పరిసరాల పరిశుభ్రత. ప్రభుత్వ ఆఫీసుల్లో పెండింగ్ పైళ్ల క్లియరెన్స్, ఆరోగ్యం, అరైవ్ – అలైవ్, సంక్షేమం, పిల్లల భద్రత.. డ్రగ్స్ కు అడ్డుకట్ట, రైతు సంక్షేమం – వ్యవసాయం, విద్య, యువత – క్రీడలు, మహిళలు, పర్యావరణం థీమ్ లతో 99 రోజుల కార్యచరణ తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో ప్రగతి పథంలో పయనిద్దామని పిలుపునిచ్చారు.