న్యూఢిల్లీ లోని రైల్ భవన్‌లో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు భేటీ అయ్యారు. ధోలేరా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు పురోగతి, విశాఖపట్నం కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభంపై చర్చించారు. శ్రీకాకుళం జిల్లాలో రైల్వే మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు రామ్మోహన్ తెలిపారు. ముఖ్యంగా శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్ మరియు తిరుపతికి నేరుగా రైళ్లు, మందస రోడ్, పాతపట్నం మరియు హరిశ్చంద్రపురం స్టేషన్లలో కీలక రైలు నిలుపుదలలు, కామేశ్వరీపేట హాల్ట్ స్టేషన్ అభివృద్ధి, ఎన్‌హెచ్-16 పక్కన ఉన్న హరిశ్చంద్రపురం స్టేషన్‌ను లాజిస్టిక్స్ హబ్‌గా అప్‌గ్రేడ్ చేయడం వంటి అంశాలపై చర్చించినట్లు రామ్మోహన్ నాయుడు ‘ఎక్స్’ వేదికగా వివరించారు. కొత్త ROBలు/RUBలు మరియు స్టేషన్ లలో ప్రయాణికుల సౌకర్యాలపై కూడా ప్రతిపాదనలు అందించినట్లు తెలిపారు. ధోలేరా అభివృద్ధికి అనుగుణంగా రైల్వే మౌలిక వసతులను సమన్వయం చేస్తూ, భవిష్యత్ విస్తరణకు అనుకూలంగా ఎయిర్–రైల్ కనెక్టివిటీపై కూడా చర్చించారు. ప్రధాని మోడీ దార్శనిక నాయకత్వంలో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేందుకు, సమగ్ర మల్టీ-మోడల్ కనెక్టివిటీ ద్వారా దేశ నిర్మాణాన్ని వేగవంతం చేయడానికి కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేశారు.