మిడిల్ ఈస్ట్ లో ప్రస్తుతం కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ప్రపంచాన్ని కలవరపెడుతున్న పరిస్థితి తెలిసిందే. ఇక భారత్ కు అక్కడి నుండి ఇప్పటి దాకా 67,000 మంది భారతీయ పౌరులు సేఫ్ గా స్వదేశానికి తిరిగి వచ్చారని కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ తెలిపారు. ఈరోజు ఆయన రాజ్యసభలో మిడిల్ ఈస్ట్ లోని తాజా పరిణామాలపై ఒక కీలక ప్రకటన చేశారు. సంక్షోభం కొనసాగుతున్నప్పటికీ, భారతీయుల సెక్యూరిటీకి, వారిని సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రభుత్వం అన్ని చర్యలూ తీసుకుంటోందని పేర్కొన్నారు. ఆయా ప్రాంతాల్లోని ఎయిర్ స్పేస్ ను పాక్షికంగా తెరిచిన ప్రతీసారి, కమర్షియల్ ఫ్లైట్స్ తో పాటు స్పెషల్ ఫ్లైట్స్ తో ఇండియన్స్ ను స్వదేశానికి రప్పిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8 నాటికి ఈ సంఖ్య 67,000కు చేరిందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఇరాన్లో ఉద్రిక్తతలు పెరగడంతో టెహ్రాన్ లోని భారత ఎంబసీ అక్కడి స్టూడెంట్స్, ఇతర పౌరులకు సహాయం అందించడానికి చర్యలు తీసుకుందని జై శంకర్ తెలిపారు. పలువురు స్టూడెంట్స్ ను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వివరించారు. బిజినెస్ కోసం ఇరాన్ లో ఉన్న భారతీయులు, పొరుగున ఉన్న అర్మేనియాకు వెళ్లి అక్కడి నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. టెహ్రాన్‌లోని ఎంబసీ పూర్తిస్థాయిలో పనిచేస్తోందని, అత్యంత అలెర్ట్ గా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమాసియాలోని పరిణామాలను ప్రధాని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని జై శంకర్ సభకు తెలిపారు. యూఏఈ, ఖతార్, సౌదీ అరేబియా, ఒమాన్, జోర్డాన్, ఇజ్రాయెల్, బహ్రెయిన్ దేశాధినేతలతో ప్రధాని మాట్లాడిన సందర్భాన్ని గుర్తు చేశారు. తాను కూడా ఆయా దేశాల విదేశాంగ మంత్రులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు స్పష్టం చేశారు.