విశ్వ క్రీడల్లో గోల్డ్ మెడల్..భారత్ తదుపరి టార్గెట్ అదే..!

Spread the love

అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా టీ 20 వరల్డ్ కప్ ఫైనల్ లో న్యూజిలాండ్‌ పై భారీ విజయంతో పాటు కప్ ను వరుసగా రెండో సారి, మొత్తంగా మూడోసారి కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా, భారత్ ఇక తన తదుపరి టార్గెట్ ను ఫిక్స్ చేసింది. ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన ఆనందంలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ రానున్న  ప్రణాళికలపై స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టు తర్వాతి ప్రధాన టార్గెట్ ప్రపంచ క్రీడలైన ఒలింపిక్స్‌ లో గోల్డ్ మెడల్ సాదించడమేనని స్పష్టం చేశాడు. 2028వ సంవత్సరం భారత క్రికెట్‌కు అత్యంత కీలకం కానుంది. 2028 ఒలింపిక్ లో గోల్డ్ మెడల్ అలాగే అదే ఏడాది జరిగే టీ20 వరల్డ్ కప్‌ ను కూడా కైవసం చేసుకోవడమని సూర్య తెలిపాడు. దాదాపు 128 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత 2028 లో లాస్ ఏంజెలెస్‌ లో జరగనున్న ఈ ప్రతిష్టాత్మక విశ్వ క్రీడల్లో క్రికెట్‌ ను చేర్చడం క్రీడాలోకంలో ఒక చారిత్రాత్మక పరిణామం. టీ20 ఫార్మాట్‌ లో జరగనున్న ఈ పోటీల్లో గెలిచిన జట్టుకు ఇచ్చే గోల్డ్ మెడల్ కోసం భారత్ తన ప్రణాళికలు రెడీ చేసుకుంటున్నట్లే కనిపిస్తోంది. ఒలింపిక్స్‌ లో క్రికెట్‌ తో పాటు స్క్వాష్, ఫ్లాగ్ ఫుట్‌బాల్ వంటి క్రీడలకు కూడా స్థానం లభించింది. అయితే ఇక ఈ మెగా ఈవెంట్‌లో పాల్గొనే జట్ల క్వాలిఫై స్టాండర్డ్స్ పై  ఐసీసీ ఇంకా స్పష్టతనివ్వాల్సి ఉంది. ఆతిథ్య దేశ హోదాలో అమెరికా నేరుగా అర్హత సాధించే అవకాశం ఉండగా, ఇతర జట్లు తమ స్థానాన్ని ఎలా కన్ఫర్మ్  చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *