అంతర్జాతీయ రాజకీయాల్లో హాట్ టాపిక్..పుతిన్ కు ట్రంప్ కాల్

Spread the love

మిడిల్ ఈస్ట్ లో పరిస్థితులు అక్కడికే పరిమితం కాకుండా ప్రపంచాన్ని కలవరపెడుతున్నాయి. ఇదిలా ఉండగా..అగ్రరాజ్యం అమెరికా, రష్యా దేశాల మధ్య సాగుతున్న టెలిఫోన్ రాయబారం ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తావిస్తోంది.  ప్రపంచ రాజకీయ పరిణామాలు అంతకంతకూ ఆసక్తిగా మారుతున్నాయి.  అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్,  రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్ మధ్య దాదాపు గంట పాటు సుదీర్ఘంగా ఫోన్ సంభాషణ సాగింది. రష్యా విదేశాంగ విధాన ప్రతినిధి యూరీ ఉషకోవ్ స్వయంగా ఈ విషయాన్ని ధృవీకరించారు. ట్రంప్ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత వీరిద్దరి మధ్య జరిగిన అత్యంత కీలకమైన చర్చగా దీన్ని భావిస్తున్నారు.  గత రెండేళ్లుగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్న ఉక్రెయిన్-రష్యా యుద్ధంపై ప్రధానంగా చర్చ జరిగింది. ఉక్రెయిన్‌లో శాంతిని నెలకొల్పేందుకు మాస్కో, వాషింగ్టన్ , కీవ్ మధ్య జరుగుతున్న చర్చల పురోగతిపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. తాను అధికారంలోకి వస్తే 24 గంటల్లో యుద్ధాన్ని ఆపుతానన్న ట్రంప్ మాటలకు ఈ ఫోన్ కాల్ ఒక బలమైన పునాదిగా కనిపిస్తోంది. ఉషకోవ్ వెల్లడించిన వివరాల ప్రకారం చర్చలు ఎంతో స్వేచ్ఛాయుతంగా జరిగాయి.ఇరు దేశాల మధ్య ఉన్న విభేదాలను పక్కన పెట్టి నిర్మాణాత్మకంగా ఈ సంభాషణ జరిగినట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్ సంక్షోభానికి దౌత్యపరమైన పరిష్కారం కనుగొనేందుకు ఇద్దరు నేతలు సుముఖత వ్యక్తం చేశారు. కేవలం ఉక్రెయిన్ మాత్రమే కాదు, ప్రస్తుతం మండుతున్న పశ్చిమాసియా సంక్షోభంపై కూడా చర్చ జరిగింది. ఇరాన్-అమెరికా మధ్య ఉన్న ఉద్రిక్తతలు, ఇజ్రాయెల్ చుట్టూ జరుగుతున్న యుద్ధ వాతావరణంపై ట్రంప్, పుతిన్ తమ అభిప్రాయాలను  పంచుకున్నారు. ప్రపంచ ఆయిల్  ధరలను, ఆర్థిక స్థిరత్వాన్ని ప్రభావితం చేస్తున్న ఈ ప్రాంతంలో శాంతి నెలకొనడం ఎంత అవసరమో ఇద్దరూ అంగీకరించినట్లు తెలుస్తోంది. బైడెన్ హయాంలో రష్యా-అమెరికా సంబంధాలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోయాయి. అయితే ట్రంప్ రాకతో ఈ సమీకరణాలు మారుతున్నాయి. ఉషకోవ్ చెప్పిన దాని ప్రకారం, ఈ చర్చలు కేవలం లాంఛనప్రాయంగా కాకుండా, సమస్యల మూలాల వరకు వెళ్లాయి. రష్యా డిమాండ్లు , అమెరికా ప్రయోజనాల మధ్య ఒక మధ్యేమార్గం కోసం ట్రంప్ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టమవుతోంది. గత వారం రోజులుగా ఇరాన్ చుట్టూ జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, పుతిన్ చాలా కీలకంగా వ్యవహరించారు. ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్‌తో పాటు గల్ఫ్ దేశాల నాయకులతో పుతిన్ జరిపిన చర్చల సారాంశాన్ని ఆయన ట్రంప్‌కు వివరించారు. ఈ ప్రాంతంలో శాంతి స్థాపన జరగాలంటే ఏం చేయాలి? యుద్ధం తీవ్రతరం కాకుండా ఉండాలంటే ఏయే దేశాల సహకారం అవసరం? అనే అంశాలను పుతిన్ స్పష్టంగా ప్రస్తావించారు. మిడిల్ ఈస్ట్ లో  ఏ దేశం శాంతిని కోరుకుంటోంది, ఏ దేశం దూకుడు ప్రదర్శిస్తోందనే విషయాన్ని పుతిన్ తనదైన శైలిలో ట్రంప్ ముందు ఉంచారు. అటు ట్రంప్ కూడా ప్రస్తుత పరిణామాలపై తన స్టాండ్ ను  పుతిన్‌తో పంచుకున్నారు. ఈ ఇద్దరు అగ్రనేతలు ఒక మాట మీదకు  వస్తే యుద్ధాలు ఆగిపోవడం పెద్ద కష్టమేమీ కాదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ చర్చల్లో మరో అత్యంత ముఖ్యమైన అంశం ‘ఎనర్జీ పాలిటిక్స్’. భారత్, చైనాతో పాటు యూరప్‌లోని తన మిత్రదేశాలకు చమురు సరఫరాను పునరుద్ధరించడానికి సిద్ధంగా ఉన్నానని పుతిన్ ప్రకటించడం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పెను మార్పులకు సంకేతం. రష్యాపై ఉన్న ఆంక్షల నడుమ కూడా భారత్ వంటి దేశాలకు సహకరించేందుకు పుతిన్ మొగ్గు చూపడం గమనార్హం. యుద్ధం వల్ల చమురు ధరలు పెరిగి సామాన్యుడు ఇబ్బంది పడకూడదన్నదే ఇక్కడ అసలు ఉద్దేశం కావాలి. ఇరాన్‌పై యుద్ధం అతి త్వరలో ముగిసిపోతుందని తాను అంచనా వేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చెప్పారు. హొర్మూజ్‌ జలసంధిలో చమురు రవాణాను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని ఇరాన్‌ ను ట్రంప్‌ హెచ్చరించారు. ఉగ్రవాద భావజాలం కలిగిన పాలకులు ప్రపంచ దేశాలకు ఇబ్బందులు సృష్టిస్తామంటే సహించబోమని అన్నారు. చమురు సరఫరాను అడ్డుకొనే ప్రయత్నం చేయొద్దని సూచించారు. హొర్మూజ్‌లో ఎలాంటి దుశ్చర్యకు పాల్పడినా.. ఇప్పటిదాకా ఇరాన్‌ చేసిన దాడి కంటే 20 రెట్లు బలంగా ఆ దేశాన్ని దెబ్బకొడతామని తేల్చిచెప్పారు. హొర్మూజ్‌లో చమురు సరఫరాకు ఆటంకాలు లేకుండా చూస్తున్నామని, ఇది చైనాకు, ఇతర దేశాలకు తాము ఇస్తున్న గిఫ్ట్  అని వ్యాఖ్యానించారు.  ట్రంప్‌ హెచ్చరికలపై ఇరాన్‌ ఇస్లామిక్‌ రెవల్యూషనరీ గార్డ్స్‌ కోర్‌(ఐఆర్‌జీసీ)  ఘాటుగా స్పందించింది. హొర్మూజ్‌ జలసంధి నుంచి ఒక్క లీటర్‌ చమురు కూడా రవాణా చేయలేరని తేల్చిచెప్పింది. తమదేశంపై దాడులు ఇలాగే కొనసాగితే హొర్మూజ్‌ నుంచి చమురు రవాణాను ఎట్టిపరిస్థితుల్లోనూ అనుమతించబోమని స్పష్టంచేసింది.  ఇరాన్ యుద్ధం ముగిసిపోతుందని ట్రంప్ అంటుంటే, ఇరాన్ మాత్రం యుద్ధం ఇప్పుడే మొదలైందని అంటోంది. పుతిన్-ట్రంప్ రాయబారాలు శాంతిని తెస్తాయా లేక కొత్త వ్యూహాలకు తెరలేపుతాయా అనేది వేచి చూడాలి. ఏది ఏమైనా, హొర్మూజ్ జలసంధిలో ఆయిల్ సరఫరా ఆగితే మాత్రం.. దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా  ప్రతి సామాన్యుడి వరకు ప్రభావం చూపుతుందనడంలో సందేహం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *