ప్రశ్నించిన గొంతుకలపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోంది:కే.టీ.ఆర్

Spread the love

ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు కోసం విద్యార్థి నాయకులు అసెంబ్లీని ముట్టడించాల్సిన దుస్థితి తెచ్చినందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిగ్గుపడాలని బీ.ఆర్.ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే.టీ.ఆర్ అన్నారు. పెండింగ్‌లో ఉన్న విద్యార్థుల స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలని, 2 లక్షల ఉద్యోగ నియామకాల హామీపై నిలదీసిన బీఆర్ఎస్‌  నేతలను అరెస్టు చేయడం దుర్మార్గమైన చర్యని మండిపడ్డారు.  ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంలోనైనా నిధులు విడుదల చేయాల్సిందిపోయి ప్రశ్నించిన గొంతుకలపై విరుచుకుపడటం ఎమర్జెన్సీని తలపిస్తోందని ఆక్షేపించారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే తొలి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని నమ్మించి నిరుద్యోగులను నయవంచన చేశారని దుయ్యబట్టారు. జాబ్ క్యాలెండర్‌ అంశంలో బీఆర్ఎస్ ప్రభుత్వం నింపిన ఉద్యోగాలను కాంగ్రెస్ ఖాతాలో వేసుకుంటున్నారన్నారు. 

విద్యావ్యవస్థను కుప్పకూల్చి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, పేద విద్యార్థులకు తీరని  అన్యాయం చేసిన పాపం విద్యాశాఖ మంత్రిగా ఉన్న సీఎందేనని ఆరోపించారు.  127 మంది విద్యార్థులు గురుకులాల్లో మరణించినా సీఎం రేవంత్ రెడ్డిలో  కనీసం చలనం లేదని  దీనిపై ఇప్పటి వరకు స్పందించలేదని విమర్శించారు. తమ పిల్లల భవిష్యత్తుపై తల్లిదండ్రులు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభుత్వం బకాయిపడ్డ స్కాలర్‌షిప్‌లు, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు  విడుదల చేయాలని డిమాండ్ చేశారు.  2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న మాటకు  మూడేళ్లు కావస్తున్న నేపథ్యంలోనైనా నిలబెట్టుకోవాలన్నారు. అక్రమంగా అరెస్టు చేసిన బీఆర్ఎస్‌వి నేతలందరిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *