జేజేఎం 2.0 ఒప్పంద కార్యక్రమంలోవర్చువల్ గా పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు

Spread the love

జల్ జీవన్ మిషన్ 2.0 కింద 2028 నాటికి రాష్ట్రంలోని ప్రతీ ఇంటికీ తాగునీటి కుళాయి లక్ష్యాన్ని సాకారం చేయనున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా ప్రతీ పల్లెకు, ప్రతీ ఇంటికీ సురక్షిత తాగునీటిని నిరంతరాయంగా అందించే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు చంద్రబాబు స్పష్టం చేశారు. నేడు  జల్ జీవన్ మిషన్ 2.0 పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఢిల్లీలో కుదిరిన ఎంఓయూ కార్యక్రమంలో సీఎం  క్యాంప్ కార్యాలయం నుండి  వర్చువల్‌గా పాల్గొన్నారు. గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ ఆపరేషన్, మెయింటెనెన్స్‌ కు రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని సీఎం వివరించారు. ఇందుకు సంబంధించి 2025 సెప్టెంబర్‌ లోనే సమగ్ర విధానాన్ని తీసుకొచ్చినట్లు గుర్తు చేశారు. డ్రింకింగ్ వాటర్ సప్లై నిర్వహణ బాధ్యతను పంచాయతీలకు అప్పగించామని తెలిపారు. డిప్యూటీ సీఎం పవన్ జల్ జీవన్ మిషన్ అమలు విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారన్నారు. జల్ జీవన్ మిషన్ 2028 వరకు కొనసాగిస్తూ కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రధాని మోడీకి సీఎం చంద్రబాబు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. పోలవరం ప్రాజెక్టును గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేయాలని టార్గెట్ గా  పెట్టుకున్నామని, దీనికి కేంద్రం సహకరించాలని ఈ సందర్భంగా జల్ శక్తి మంత్రి సీఆర్ పాటిల్‌ ను సీఎం కోరారు. జల్ జీవన్ మిషన్ 2.0 ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం అనంతరం సీఆర్ పాటిల్ మాట్లాడారు. వివిధ రాష్ట్రాల నుండి  వస్తున్న విజ్ఞప్తుల మేరకు జల్ జీవన్ మిషన్ 2.0కు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేకించి ఈ అంశంపై  ప్రధాని నరేంద్ర మోదీతో మాట్లాడారని ఈ మిషన్ పొడిగింపు కోసం ప్రతిపాదించడంపై పాటిల్ ధన్యవాదాలు తెలిపారు. ఇక పలువురు ఉన్నతాధికారులు సహా అమరావతి నుండి  వర్చువల్‌ గా డిప్యూటీ సీఎం పవన్ కూడా  పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *