మహిళా రిజర్వేషన్ చట్టం-2023కి ప్రతిపాదించిన సవరణలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతోందని ఆ పార్టీ అధినేత ఏపీ మాజీ సీఎం జగన్ అన్నారు. దీనివల్ల 2029 నుండి ఈ చట్టం అమలులోకి వచ్చే అవకాశం కలుగుతుందన్నారు. వైసీపీ ఎల్లప్పుడూ మహిళా సాధికారతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ వస్తోందని స్పష్టం చేశారు. ఇప్పటికే స్థానిక సంస్థల్లో, నామినేటెడ్ పదవుల్లో, అలాగే నామినేషన్ పద్ధతిలో ఇచ్చే పనులు మరియు సర్వీస్ కాంట్రాక్టుల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించడం ద్వారా ఆదర్శంగా నిలిచామన్నారు. అసెంబ్లీ మరియు లోక్‌సభలో 33% రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఈ నిర్ణయం ఆహ్వానించదగ్గ పరిణామమని పేర్కొన్నారు. మన ప్రజాస్వామ్యంలోని ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదిగేలా వారిని సాధికారత వైపు నడిపించడమే మా నిరంతర లక్ష్యం అని జగన్ పేర్కొన్నారు.